ఆపి ఉన్న కారులో మంటలు
నాయుడుపేటటౌన్: ఆగి ఉన్న కారులో ఒకసారిగా మంటలు చెలరేగి కారు దగ్ధమైన సంఘటన మండలంలోని నరసారెడ్డికండ్రిగ రహ దారి వద్ద మంగళవారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. మండలంలోని అరవపెరిమిడి గ్రామానికి చెందిన పాలెల హరిబాబు తన కారులో సొంతపని నిమిత్తం నరసారెడ్డి కండ్రిగ రహదారి వద్దకు వచ్చారు. కారు రోడ్డు పక్కగా ఆపి, వెళ్లాడు. కొద్ది సేపటికే కారులో మంటలు వస్తుండాన్ని స్థానికులు గుర్తించారు. హరిబాబు కూడ అక్కడ చేరుకుని అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. వారు సంఘటనా స్థలానికి చేరు కుని కారు లోంచి వస్తున్న మంటలను అదుపు చేశారు. అప్పటికే కారు చాల వరకు దగ్ధమైంది. కారు బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా గుర్తించారు.
ఘాట్ రోడ్డులో వ్యక్తి ఆత్మహత్య
తిరుమల: భార్యతో గొడవపడి మనస్తాపానికి గురై ఘాట్ రోడ్డులో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. కర్ణాటకకు చెందిన సుమన్(39) కొంతకాలంగా తిరుపతిలోని గాజుల వీధిలో నివాసం ఉంటున్నాడు. ఇతను సెలూన్ లో పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఇతడు దీపిక అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొంతకాలంగా భార్య దీపికతో గొడవలు పడుతున్నట్లు తిరుపతిలోని వారి ఇంటి యజమాని భువనేశ్వరి సమాచారం మేరకు తెలిసిందని పోలీసులు తెలిపారు. అయితే మృతుడు ఫోన్ పరిశీలించగా ఈ నెల 10వ తేదీన ఆఖరి ఫోన్ వెళ్లినట్లుగా గుర్తించామన్నారు. అయితే ఆ రోజే మృతుడి తిరుమల డౌన్ ఘాట్ రోడ్డులోని తొమ్మిదో మలుపు వద్ద అటవీ ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. ఈ ఘటనను మంగళవారం 9 మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరగా వాహనాన్ని పక్కకు పెడుతున్న సమయంలో ఆటో మెకానిక్ మనోహర్ రెడ్డి గుర్తించారన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసినట్లు తెలిపారు.
పోక్సో కేసులో
రాపిడో డ్రైవర్ అరెస్టు
తిరుపతి క్రైమ్: నగరంలో ఈనెల 3వ తేదీన బాలికపై జరిగిన అత్యాచారం కేసులో రాపిడో ఆటో డ్రైవర్‌ను మంగళవారం అరెస్టు చేసినట్లు అలిపిరి సీఐ రామకిషోర్ తెలిపారు. ఈ నెల మూడో తేదీన నగరంలోని ఓ హాస్టల్‌లో చదువుతున్న బాలిక మరో హాస్టల్‌లో మారేందుకు, సామాన్లు తీసుకుని వెళ్లేందుకు రాపిడోను బుక్ చేసుకుంది. ఆ బాలికను భయపెట్టి, బెదిరించి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా సత్యసాయి జిల్లాకు చెందిన సాయి కుమార్‌గా గుర్తించి అరెస్టు చేశామని సీఐ తెలిపారు.
ఎస్వీయూ హెల్త్‌సెంటర్‌కు ఈసీజీ యంత్రం వితరణ
తిరుపతి సిటీ: ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్ టాటా నర్సింగరావు వర్సిటీలోని ఆరోగ్య కేంద్రానికి తన వ్యక్తిగత నిధులతో ఈసీజీ యంత్రాన్ని బహుకరించారు. ఈ మేరకు తన చాంబర్‌లో మంగళవారం రూ. 27వేలు విలువ గల పోర్టబుల్ ఈసీజీ యంత్రాన్ని ల్యాబ్ టెక్నీషియన్ ముత్తువేలుకు అందజేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ విద్యార్థులు, సిబ్బంది, క్యాంపస్ నివాసితులకు సకాలంలో పరీక్షలు చేయడానికి యూనివర్సిటీ హెల్త్ సెంటర్ సౌకర్యాలను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో తనవంతు సహాయ సహకారం అందించామన్నారు.
మద్యం దుకాణంలో చోరీ
తిరుపతి క్రైమ్: నగరంలోని ఓ మద్యం దుకాణంలో చోరీ జరిగిన సంఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. అలిపిరి సీఐ రామకిషోర్ కథనం మేరకు.. కరకంబాడి రోడ్డులోని ఎస్వీఎస్ వైన్‌షాప్‌లో గుర్తుతెలియని దుండగులు ఈనెల 14వ తేదీ అర్ధరాత్రి అనంతరం వైన్‌షాప్ గోడ పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. దుకాణంలో ఉన్న కౌంటర్‌లో 2.45 లక్షలు దోచుకెళ్లినట్లుగా షాపు సిబ్బంది మని ప్రసాద్ తెలిపారన్నారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.
ఆపి ఉన్న కారులో మంటలు


