వైభవంగా గొబ్బెమ్మ ఉత్సవం
శ్రీకాళహస్తి: ధనుర్మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరాలయంలో మంగళవారం మనోన్మణి(గొబ్బెమ్మ)కు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం విశేషంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలు సమర్పించారు. అమ్మవారిని చప్పరాలపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
జాతీయ యోగా పోటీల్లో బీవీబీ విద్యార్థి ప్రతిభ
తిరుపతి సిటీ: మహారాష్ట్ర వేదికగా ఈనెల 30వ తేదీన జరగనున్న జాతీయ స్థాయి సబ్ జూనియర్స్ యోగాసన స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీలకు భారతీయ విద్యాభవన్ విద్యార్థి టి సుయశ్వంత్ ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థి జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపిక కావడం పాఠశాలకు గర్వకారణమని డైరెక్టర్ సత్యనారాయణ, ప్రిన్సిపల్ పద్మజ కొనియాడారు.
రాస్ కృషి విజ్ఞాన కేంరద్రం సందర్శన
రేణిగుంట: మండలంలోని కరకంబాడి పంచాయతీలో ఉన్న రాస్ కృషి విజ్ఞాన కేంద్రాన్ని మంగళవారం హైదరాబాద్‌కు చెందిన ఐసీఏఆర్–అటారీ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ జేవీ ప్రసాద్ సందర్శించారు. ముందుగా ఆయన కేవీకే శాస్త్రవేత్తలతో సమావేశమై దత్తత గ్రామాల్లో రాస్ చేపట్టిన వివిధ కార్యక్రమాల ప్రగతి, 2025–2026 సంవత్సరానికి నిర్దేశించిన కార్యక్రమాల ప్రణాళిక అమలు గురించి చర్చించారు. కేవీకే శాస్త్రవేత్తల పనితీరు, కార్యక్రమాల ప్రగతిని ప్రశంసించారు. రైతులకు సాగు ఖర్చు తగ్గించి ఆదాయం పెంచే సాంకేతికతలో భాగంగా సమగ్ర సస్యరక్షణ, జీవన ఎరువుల వినియోగం, పురుగుమందుల పిచికారీలో డ్రోన్‌ల వినియోగం, ప్రకృతి వ్యవసాయ విధానం, ప్రకృతి వ్యవసాయంలో వాడే కషాయాలు, ఘన, ద్రవ జీవామతం వంటి ముడి పదార్థాల తయారీపై అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో కేంద్ర సీనియర్ శాస్త్రవేత్త డా.ఎస్.శ్రీనివాసులు, కె.వి.కె శాస్త్రవేత్తలు సుధాకర్, దివ్య, రాము కుమార్, అనూష, దివ్య సుధ, సిబ్బంది పాల్గొన్నారు.
వైభవంగా గొబ్బెమ్మ ఉత్సవం
వైభవంగా గొబ్బెమ్మ ఉత్సవం


