ప్రైవేట్ కొలువు వదిలి.. ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు
రామచంద్రాపురం: ఇంజినీరింగ్ విద్యను అభ్యసించి పదేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసిన యువకుడు హరికృష్ణ రెండేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ వ్యవసాయ రంగంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. మండలంలోని వెంకట్రామాపురం సమీపంలో మూడు ఎకరాల లీజు భూమిలో 20 రకాల ఆకుకూరలు, కూరగాయలు సాగు చేస్తూ స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. ప్రకృతి సాగుపై పూర్తిగా అవగాహన లేకపోయినా, రైతుల సూచనలు, శిక్షణతో ముందుకెళ్లి విజయాన్ని సాధించిన హరికృష్ణ, తిరుపతిలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేకంగా దుకాణాలు కూడా ప్రారంభించారు. కలుషితం లేని ఆహా రానికి ప్రజల్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నాణ్యత, స్వచ్ఛతతో పండించిన పంటల్లో లాభాలను ఆర్జిస్తున్నారు. మంగళవారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త కార్యక్రమంగా రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణ లో భాగంగా తిరుపతి జిల్లా డీపీఎం షణ్ముగం నేతృత్వంలో 150 మంది ప్రకృతి వ్యవసాయ కార్యకర్తలు హరికృష్ణ క్షేత్రాన్ని సందర్శించారు. ప్రకృతి వ్యవసా య అధికారి డీపీఎం షణ్ముగం మాట్లాడుతూ రూ.లక్షల్లో జీతం తీసుకునే ఉద్యోగాన్ని వదిలి ప్రకృతి వ్యవసాయాన్ని ఎంచుకున్న హరికృష్ణ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్పీ భానుమూర్తి, మధు, నీలమ్మ, శ్రీదేవి, బాబాసాహెబ్, అయ్యప్ప నాయుడు పాల్గొన్నారు.


