శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు
చంద్రగిరి: శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని చంద్రగిరి సీఐ సురేష్ కుమార్ హెచ్చరించారు. మండలంలోని తొండవాడలో సోమవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనాలను దగ్ధం చేసిన ఘటనలో నిందుతుడిని మంగళవారం అదుపులోకి తీసుకుని, మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని పిచ్చినాయుడుపల్లి దళితవాడకు చెందిన రేణిగుంట గౌతం(పెప్సీ) అనే యువకుడు ఆదివారం రాత్రి తొండవాడలోని సంధ్య, ఆమె భర్త మహేంద్రరెడ్డిపై మద్యం మత్తులో కత్తితో దాడికి యత్నించారన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు యువకుడిని మందలించి పంపించినట్లు తెలిపారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున సంధ్య ఇంటి ఆవరణలో ఉంచిన రెండు ద్విచక్ర వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించి పారిపోయినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గౌతంను విచారించగా, ద్విచక్ర వాహనాలను తగలబెట్టినట్లు అంగీకరించారని చెప్పారు. గౌతంపై ఇప్పటికే చంద్రగిరి, తిరుపతి రూరల్, గూడూరు పోలీసు స్టేషన్లలో చోరీలు, గొడవలకు సబంధించి కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ మేరకు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిచినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ అరుణాచలం, సిబ్బంది నాగమణి, మణి, వినాయక, మహేష్ తదితరులు పాల్గొన్నారు.


