పరికరాలపై అవగాహన పెంచుకోవాలి
తిరుపతి సిటీ: పరిశోధనలకు కేంద్రమైన ప్రయోగశాలల్లో పరికరాల నిర్వహణపై పరిశోధకులు తగిన అవగాహన పెంపొందించుకోవాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎస్ విజయభాస్కర్‌రావు కోరారు. ఎస్వీ యూనివర్సిటీ ఫిజిక్స్ విభాగం ఆధ్వర్యంలో ల్యాబ్ మెటీరియల్‌పై వారం రోజులు జరిగే స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను సోమవారం వర్సిటీలోని సెనెట్ హాల్‌లో ప్రారంభించారు. ఈ కార్యాక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడుతూ గొప్ప పరిశోధన కేంద్రాలు, యూనివర్సిటీల్లో ఎంతో విలువైన ప్రయోగశాలలు అందుబాటులో ఉన్నాయన్నారు. ముంబై వెస్ట్రన్ రీజినల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ సెంటర్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ పరికరంపై అవగాహన ఉన్నప్పుడే పరిశోధకులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎస్వీయూ రెక్టార్ ప్రొఫెసర్ సీహెచ్ అప్పారావు , ఫిజిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ దేవప్రసాదరాజు, రిజిస్ట్రార్ భూపతినాయుడు, కో–ఆర్డినేటర్ ప్రొఫెసర్ దేవప్రసాదరాజు, ప్రొఫెసర్ హేమ, ప్రిన్సిపల్ పద్మావతి పాల్గొన్నారు.
మా బతుకులు ఇంతేనా?
వాకాడు: కొన్నేళ్లుగా తమిళనాడుకు చెందిన జాలర్లు స్పీడు బోట్లతో సముద్రంపై హద్దులు దాటి తమ పరిధిలోకి చొచ్చుకొనివచ్చి అక్రమంగా వేట చేసి, తమకేమీ మిగల్చకుండా విలువైన మత్స్యసంపదను దోచుకుపోతున్నారని జిల్లా మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సోమవారం జిల్లాలోని సముద్రతీరంలో ఉన్న చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండలంలోని సముద్రంలో దాదాపు 52 స్పీడు బోట్లు ఒక్కసారిగా పరిధి దాటి వందల టన్నుల మత్స్యసంపదను దోచుకుపోయారు. దీన్ని గమనించిన స్థానిక మత్స్యకారులు అడ్డుకునే ప్రయత్నం చేయగా వారిపై రాళ్ల దాడికి దిగడంతో తప్పించుకుని ఒడ్డుకు చేరుకున్నారు. పొరుగు రాష్ట్రాల స్పీడు బోట్లు దందాను ఎవరు ఆపలేకున్నారని, మా బతుకులు ఇంతేనా అని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పరికరాలపై అవగాహన పెంచుకోవాలి


