గంజాయి మత్తులో యువకుడు వీరంగం
చంద్రగిరి: మండలంలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న దంపతులపై ఆదివారం సాయంత్రం గంజాయి మత్తులో ఓ యువకుడు కత్తితో దాడికి యత్నించి, వీరంగం చేశాడు. బాఽధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ యువకుడు సోమవారం తెల్లవారుజామున వారి రెండు ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టాడు. ఈ ఘటన మండలంలోని తొండవాడలో చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. తొండవాడలో మహేంద్రరెడ్డి, సంధ్య దంపతులు కిరాణా దుకాణం పెట్టుకుని జీవిస్తున్నారు. ఆదివారం సాయంత్రం పిచ్చినాయుడుపల్లికి చెందిన గౌతమ్ కుమార్ (పెప్సీ) అనే యువకుడు మత్తులో కిరాణా దుకాణం నడుపుతున్న సంధ్య, ఆమె భర్త మహేంద్రరెడ్డిపై కత్తితో దాడికి యత్నించాడు. ఈ క్రమంలో సంధ్య చంద్రగిరి పోలీసు స్టేషన్ చేరుకుని జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలికి చేరుకుని మత్తులో ఉన్న గౌతమ్ కుమార్(పెప్సీ)ని అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చి మందలించి పంపివేశారు. దీనిపై కక్షకట్టిన గౌతమ్ కుమార్ సోమవారం వేకువజామున మహేంద్రరెడ్డి ఇంటి ఆవరణలో ఉంచిన రెండు ద్విచక్రవాహనాలపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. దీనిపై బాధితులు మరో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయి మత్తులో యువకుడు వీరంగం


