రైళ్లలో చోరీలు.. దొంగ అరెస్టు
– రూ.9 లక్షల విలువచేసే సొత్తు స్వాధీనం
రేణిగుంట: స్థానిక రైల్వే పరిధిలో కొంత కాలంగా ప్లాట్‌ఫామ్‌లపై, కదులుతున్న రైళ్లలో చోరీలు చేస్తున్న వ్యక్తిని సోమవారం అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ 9.10 లక్షల విలువ చేసే 91 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు జీఆర్పీ సీఐ యతీంద్ర తెలిపారు. రేణిగుంట రైల్వేస్టేషన్‌లోని జీఆర్పీ పోలీస్ స్టేషన్‌లో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ యతీంద్ర ఈ వివరాలు వెల్లడించారు. వరుస చోరీల నేపథ్యంలో తిరుపతి డీఎస్‌ఆర్పీఎస్‌ఆర్ హర్షిత ఆదేశాల మేరకు ఆర్పీ ఎస్‌ఐ మధుసూదన్‌రావు, ధర్మేంద్ర రాజు సిబ్బందితో కలిసి రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. చోరీలకు పాల్పడుతున్నది చైన్నెలోని ఎర్నావూర్‌కు చెందిన నీలా లోకేష్ కుమార్ (36)గా గుర్తించి పుత్తూరు రైల్వే స్టేషన్ టూవీలర్ పార్కింగ్‌లో అరెస్టు చేశామన్నారు. అతని వద్ద నుంచి రూ 9.10 లక్షల విలువ చేసే 91 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు.


