ఇస్రో బాహుబలిగా ఎల్‌వీఎం3
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) రూపొందించిన జీఎస్‌ఎల్‌వీ రాకెట్లలో ఎల్‌వీఎం3 రాకెట్‌ది ప్రత్యేకమైన స్థానంగా చెప్పుకోవచ్చు. జీఎస్‌ఎల్‌వీ సిరీస్ ప్రారంభమైన తరువాత ఎల్‌వీఎం3 రాకెట్‌ను రూపొందించారు. జీఎస్‌ఎల్‌వీ రాకెట్‌కు మొదటిదశలో నాలుగు ద్రవ ఇంధన స్ట్రాపాన్ బూస్టర్లను అమర్చితే ఎల్‌వీఎం3 రాకెట్‌కు అత్యంత శక్తివంతమైన ఘన ఇంధన స్ట్రాపాన్ బూస్టర్లను మొదటి దశలో అమర్చారు. ఈ రాకెట్ విషయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు అందిపుచ్చుకోవడంలో ఎంతో పరిణితి సాధించారు. పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌లను నాలుగు దశల్లో ఘన, ద్రవ ఇంధన దశలతో ప్రయోగిస్తే జీఎస్‌ఎల్‌వీ, ఎల్‌వీఎం3 రాకెట్లను ద్రవ, ఘన, క్రయోజనిక్ ఇంధనాలతో మూడు దశల్లోనే ప్రయోగిస్తున్నారు. జీఎస్‌ఎల్‌వీ రాకెట్లకు అత్యంత కీలకమైన దశగా భావించే క్రయోజనిక్‌దశ ఎంతో సంక్లిష్టమైంది. దీనికి సంబంధించి లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ అనే రెండు రకాల ఇంధనాలు క్రయోదశలో ఉంటాయి. ఈ తరహా ఇంధనం తయారు చేయాలంటే మైనస్ 270 డిగ్రీల సెల్సియస్ వాతావరణంలో తయారు చేయాల్సి ఉండడంతో దీన్ని రష్యా నుంచి అరువు తెచ్చుకుని ఆరు ప్రయోగాలు చేశారు. ఒక క్రయో ఇంజిన్‌ను దగ్గర ఉంచుకుని పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో క్రయోదశను కూడా రూపొందించి జీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇప్పటికి 18 ప్రయోగాలు చేయగా 14 ప్రయోగాలను విజయవంతం అయ్యాయి, నాలుగు ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని జీఎస్‌ఎల్‌వీ మార్క్–3 (ఎల్‌వీఎం3) రాకెట్ లాంటి భారీ రాకెట్లను రూపొందించడంలో కూడా ఎంతో పరిణితిని సాధించారు. జీఎస్‌ఎల్‌వీ మార్క్–3 రాకెట్‌ను మొదటిగా 2014 డిసెంబర్ 25వ తేదీన ప్రయోగాత్మకంగా ప్రయోగించి విజయం సాధించారు. ఆ తరువాత 2017 జూన్ 5 జీఎస్‌ఎల్‌వీ మార్క్3–డీ1 ద్వారా జీశాట్ –19 అనే ఉపగ్రహాన్ని, 2018 నవంబర్ 14న జీఎస్‌ఎల్‌వీ మార్క్3–డీ2 ద్వారా జీశాట్–29 ప్రయోగాలు చేసి విజయాలు నమోదు చేశారు. 2019 జులై 22న చంద్రయాన్–2 ప్రయోగాన్ని నిర్వహించే సమయంలో జీఎస్‌ఎల్‌వీ మార్క్3 పేరుతో ఉన్న ఈ రాకెట్‌ను ఎల్‌వీఎం3–ఎం1గా పేరు మార్పు చేశారు. అప్పటి నుంచి జీఎస్‌ఎల్‌వీ మార్క్3గా పేరున్న ఈ రాకెట్‌కు ఎల్‌వీఎం3 అనే పేరును వాడుకలోకి తెచ్చారు. 2022 అక్టోబర్ 23న ఎల్‌వీఎం3–ఎం2, 2023 మార్చి 26న ఎల్‌వీఎం3–ఎం3 ప్రయోగాల్లో వన్ వెబ్ ఇండియా పేరుతో రెండు వాణిజ్యపరమైన ఉపగ్రహ ప్రయోగాలను నిర్వహించి విజయాలను అందుకున్నారు. ఆ తరువాత ఇస్రోకు, భారతదేశానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్–3 ప్రయోగాన్ని 2023 జులై 14న ఎల్‌వీఎం3–ఎం4 రాకెట్ ద్వారా ప్రయోగించి ఇస్రో చరిత్రలో ఒక మైలురాయి లాంటి ప్రయోగాన్ని విజయవంతం చేసి, ప్రపంచాన్నే అబ్బుర పరిచారు. అంటే ఎల్‌వీఎం3 రాకెట్ సిరిస్‌లో ఇప్పటి దాకా ఏడు ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించి, ఆదివారం ఎనిమిదో ప్రయోగానికి సిద్ధమయ్యారు.


