హత్య కేసులో నిందితుడి అరెస్టు
చిల్లకూరు: తీర ప్రాంతంలోని తమ్మినపట్నం సమీపంలో జరిగిన హత్య కేసులో నిందితుడిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. చిల్లకూరు పోలీస్ స్టేషన్‌లో గూడూరు రూరల్ సీఐ కిషోర్‌బాబు ఈ వివరాలను వెల్లడించారు. ఒడిశా ప్రాంతానికి చెందిన కొంత మంది సాగరమాల రహదారి నిర్మాణ పనులు చేస్తున్న మెగా సంస్థలో కార్మికులుగా పని చేస్తున్నారన్నారు. వీరికి తమ్మినపట్నం సమీపంలో వసతి ఏర్పాటు చేసి ఉన్నారని తెలిపారు. ఈ క్రమంలో గత నెల 27వ తేదిన ఒడిశాకు చెందిన కొంత మంది మద్యం సేవిస్తున్న సమయంలో నరసింగ్ ఓరం అనే వ్యక్తిపై సమీర్‌నాయక్ రాడ్‌తో తలపై కొట్టి హత్య చేశాడని తెలిపారు. అప్పట్లో సహచర కార్మికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఐ కిషోర్‌బాబు పాల్గొన్నారు.
మూడు ఇసుక ట్రాక్టర్ల సీజ్
రేణిగుంట: మండలంలోని పిల్లపాళెం సమీపంలోని స్వర్ణముఖి నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను శనివారం తహసీల్దార్ చంద్రశేఖర్‌రెడ్డి సీజ్ చేసి, రెవెన్యూ కార్యాలయానికి తరలించారు. వరుసగా మూడు రోజులుగా ఇసుక అక్రమ రవాణా చేసిన ఒక టిప్పర్, జేసీబీ, 6 ట్రాక్టర్లను సీజ్ చేశారు. కానీ అస్సలు సూత్రదారులపై చర్యలు తీసుకోకపోవడం తీవ్ర చర్చనీయంగా మారింది. వాహనాలను సీజ్ చేయడం, వాటికి జరిమానా చెల్లించి, విడుదల చేసుకోవడం, మళ్లీ ఇసుక అక్రమ రవాణా చేయడం పరిపాటిగా మారింది. ఇసుక అక్రమ తవ్వకాలు నిర్వహించే సూత్రధారులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఇసుక అక్రమ రవాణా ఆగదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
విద్యుత్‌షాక్‌తో యువకుడి మృతి
పెళ్లకూరు: మండలంలోని నందిమాల దళితకాలనీకి చెందిన గంధం వీరాస్వామి(21) శనివారం పొలాల్లో విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. దళితకాలనీకి చెందిన వీరాస్వామి పొలాల్లోని మోటారు వద్ద పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. స్థానికులు మృతదేహాన్ని ఇంటికి చేర్చడంతో నిర్జీవంగా ఉన్న కుమారుడిని చూసి కన్నతల్లి ఇంద్రమ్మ గుండెలు బాదుకుంటూ రోధించడం చూపరులను కంటతడికి గురి చేసింది. మృతుని తండ్రి గున్నయ్య గతంలో గ్రామ ఉత్సవాలు సమయంలో విద్యుత్ షాక్‌తో మృతి చెందినట్లు తెలుస్తోంది.
హత్య కేసులో నిందితుడి అరెస్టు


