ఘనంగా పిల్లల పండుగ ప్రారంభం
తిరుపతి కల్చరల్: రోటరీ క్లబ్ సౌజన్యంతో తిరుపతి బాలోత్సవం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న బాలోత్సవం పిల్లల పండుగ ఎస్‌జీఎస్ ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. సుమారు 35 అంశాల్లో 6 వేదికలపై పిల్లలకు వివిధ సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. సుమారు పదివేల మంది విద్యార్థులు హాజరైన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పాల్గొని, వేడుకలను ప్రారంభించారు. పిల్లలు చదువుల ఒత్తిడికి గురి కాకుండా వారిలో దాగిన సృజనాత్మకమైన కళలను వెలికి తీసే తిరుపతి బాలోత్సవం వారు పిల్లల పండుగ చేపట్టడం అభినందనీయమన్నారు. పిల్లలను చూస్తుంటే వారిలో ఒకరిగా కలిసిపోయి తన చిన్నతనంలో ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న జ్ఞాపకాలు గుర్తు వస్తున్నాయన్నారు. తెలుగు భాషా ఔన్నత్వం కోసం పిల్లల ఆలోచనలకు పదును పెడుతున్న బాలోత్సవం కమిటీకి జిల్లా యంత్రాంగం తరఫున సహాయ సహకారాలు అందిస్తామని, ఇలాంటి కార్యక్రమాలను మరిన్ని విస్తృతంగా నిర్వహించి పిల్లలను ప్రతిభావంతులు కావడానికి దోహదపడాలని తెలిపారు. డీఈఓ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని పాఠశాలల పిల్లలను ఈ బాలోత్సవంలో భాగస్వాములను చేశామన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలు అందిస్తామని తెలిపారు. అతిథులుగా విచ్చేసిన జగన్నాథం, రమేష్ నాథ్ లింగుట్ల, పీసీ.రాయులు, విక్రమ్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా ఆటాపాటలతో పిల్లల ప్రతిభకు తార్కాణంగా ఈ బాలోత్సవం నిర్వహించడం తిరుపతికే గర్వకారణమని కొనియాడారు. అనంతరం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పిల్లలకు 21 అంశాలపై వివిధ విభాగాలవారీగా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలోత్సవం వ్యవస్థాపకుడు మల్లారపు నాగార్జున, అధ్యక్షుడు నడ్డినారాయణ, సుంకర రెడ్డెప్ప, పేరూరు బాలసుబ్రమణ్యం, గోవిందయ్య, గురునాథం, మునిలక్ష్మి, తహసున్నీసా బేగం, పంచముఖేవ్వరరావు, రమణ, కుప్పుస్వామి, రవీంద్ర, ప్రసాద్ చౌదరి, మణికంఠ, మురళి, గోపాల్, జయరామయ్య, ఆమూరి సుబ్రమణ్యం, అంకమనాయుడు పాల్గొన్నారు.
ఘనంగా పిల్లల పండుగ ప్రారంభం


