పండుగ వాతావరణంలో పద్మావతీ బ్రహ్మోత్సవాలు
చంద్రగిరి: నవంబర్ 17 నుంచి 25వ తేదీ వరకు తిరుచానూరు పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పండుగ వాతావరణంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ తిరుపతి జేఈఓ వీరబ్రహ్మం సూచించారు. తిరుపతి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ ఉన్నతాధికారులతో శనివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ మాట్లాడుతూ భక్తుల రద్దీని ముందస్తుగా అంచనా వేసుకుని, అందుకు తగ్గట్లు వారం రోజుల ముందే ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. శాఖలవారీగా అనుమతులు పెండింగ్‌లో ఉంటే వెంటనే అప్రూవల్ తీసుకుని, పనులను వేగవంతం చేయాలన్నారు. అమ్మవారి గరుడ వాహన సేవ, గజ వాహన సేవ, పంచమి తీర్థం రోజున భక్తుల తాకిడి అధికంగా ఉండే అవకాశం ఉందని, భక్తుల రద్దీకి తగ్గట్లు అన్నప్రసాదాలు, క్యూలు, సెక్యూరిటీ, పద్మసరోవరానికి ప్రవేశం, నిష్క్రమణ, మెడికల్, పారిశుద్ధ్యపనులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. తిరుమలలో విద్యుద్దీపాలంకరణలు, ఫల,పుష్ప ప్రదర్శన ఏలాగైతే భక్తులను ఆకట్టుకున్నాయో? అదే రీతిలో తిరుచానూరులో ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్, గార్డెన్ విభాగాధికారులకు సూచించారు. తిరుపతి, తిరుచానూరు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా పంచాయతీ అధికారులను సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలన్నారు.
ఏర్పాట్లలో రాజీ పడొద్దు
నవంబర్ 16 అంకురార్పణ నుంచి పంచమి తీర్థం వరకు అధికారులు రాజీపడకుండా ఏర్పాట్లు చేపట్టాలని జేఈఓ ఆదేశించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు, రంగోలీ, పీఏ సిస్టమ్, ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాబృందాల ప్రదర్శనలు ఉండాలన్నారు. భక్తులకు సౌకర్యవంతంగా అన్నప్రసాదాలు అందించేలా నవజీవన్, తోళప్పగార్డెన్స్, పూడి, హైస్కూల్ ప్రాంతాల్లో ఏర్పాట్లు పటిష్టంగా చేయాలన్నారు. పంచమి తీర్థం రోజున అలిపిరి నుంచి తిరుచానూరు వరకు పడి ఊరేగింపులో భక్తులకు ముందస్తుగా సమాచారం తెలిసేలా ప్రకటనలు ఇవ్వాలని, భక్తులకు తాగునీరు, సాంస్కృతిక కార్యక్రమాలు, వైద్య సేవలు తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. అలాగే పోలీసు, రెవెన్యూ, పంచాయతీ అధికారులతో సమన్వయం చేసుకుని భక్తులకు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. బ్రహ్మోత్సవాలకు అవసరమైన శ్రీవారి సేవకులను సమీకరించుకోవాలన్నారు. ఎస్వీబీసీ ద్వారా బ్రహ్మోత్సవాలను ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ సీఈ టీవీ సత్యనారాయణ, ఎఫ్‌ఎఅండ్ సీఏవో బాలాజీ, తిరుచానూరు ఆలయ డిప్యూటీ ఈఓ హరీంద్రనాథ్, ఐటీ జీఎం ఫణికుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.


