హత్యకేసులో నిందితుల అరెస్టు
నాగలాపురం: మండల కేంద్రంలో ఒంటరి మహిళను హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. అక్టోబర్ 24 వ తేదీ బీసీకాలనీలో ఇంట్లో నిద్రిస్తున్న ఒంటరి మహిళ మునిలక్ష్మి (55) హత్యకు గురైన విషయం తెలిసిందే. దీనిపై నాగలాపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. సత్యవేడు సీఐ మురళి నాయుడు, ఎస్‌ఐ సునీల్ కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను శనివారం అరెస్టు చేశారు. ఈ వివరాలను సీఐ మీడియాకు వెల్లడించారు. నారాయణవనం మండలం పాలమంగళం గ్రామానికి చెందిన దుర్వాసులు(55) భార్య మునీశ్వరి(48) తన సమీప బంధువైన నాగలాపురం బీసీ కాలనీలోని మునిలక్ష్మి ఇంటికి వెళ్లారు. ఆమెను రూ.30 వేలు అప్పుగా అడిగారు. ఇందుకు మునిలక్ష్మి నిరాకరించడంతో వీరిద్దరు ఆ రాత్రికి మునిలక్ష్మి ఇంట్లో నిద్రించి ఆదివారం ఉదయం 4 గంటలకు మునిలక్ష్మిని గొంతు నులిమి హత్య చేసి, ఆమె వద్ద ఉన్న 35 గ్రాముల బంగారు నగలను అపహరించుకుని పారిపోయారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన నాగలాపురం పోలీసులు నిందితులను శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 35 గ్రాములు బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరిపై గతంలో తమిళనాడులోని మాదరపాకంలో ఓ మహిళను హతమార్చిన ఘటనలో యావజ్జీవ జైలుశిక్ష అనుభవించి, శిక్ష అనంతరం 2018లో విడుదలయ్యారన్నారు. తరువాత స్వగ్రామమైన పాలమంగళం వదిలి తిరుపతిలో నివాసం ఉంటూ సమీప బంధువైన మునిలక్ష్మిపై కన్నేసి ఈ హత్యకు పాల్పడ్దారని సీఐ మురళి నాయుడు తెలిపారు. నిందితుల అరెస్టులో ప్రతిభ చూపిన నాగలాపురం ఎస్‌ఐ సునీల్, శిక్షణ ఎస్‌ఐ ప్రసాద్, తోటి సిబ్బందిని సీఐ అభినందించారు.


