 
															పైసా వసూల్
బరితెగించారు! పైరవీలే ప్రాతిపదిక పేతాలజీ విభాగంలో ఖాళీ ఒకటే..భర్తీ మాత్రం రెండు కనీస అర్హత లేకున్నా మరో ప్రొఫెసర్ నియామకం ఆ బాబు చెప్పారని ఇద్దరిని, ఓ ఎమ్మెల్యే కోడలని మరొకరికి పోస్టింగ్ గాలికి ఎన్‌ఎంసీ నిబంధనలు స్విమ్స్ ఆస్పత్రిలో ఇష్టారాజ్యం
పైసా వసూళ్లే కూటమి నేతల లక్ష్యం.. అందుకు స్విమ్స్‌లో కొలువుల పందేరం.. టీటీడీ పై ఒత్తిళ్లు.. నిబంధనలకు నీళ్లు.. తమ అనుచరులకే ఉద్యోగాలివ్వాలని సిఫార్సులు.. యోగ్యత లేకున్నా ఉద్యోగం.. ఎట్టకేలకు ధర నిర్ణయించి, పుచ్చుకుని స్విమ్స్‌లో పోస్టుల భర్తీ చేశారు. ఫలితంగా ఇటు రోగులు, అటు విద్యార్థులకు నష్టం వాటిల్లడమే కాకుండా పలు కోర్సులు రద్దు అయ్యే ప్రమాదం. ఇదీ స్విమ్స్‌లో రాజకీయ జోక్యం తీరు.
సాక్షి టాస్క్‌ఫోర్స్: స్విమ్స్‌లో వైద్యుల నియామకాల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎన్‌ఎంసీ నిబంధనలు గాలికి వదిలేసి నియామకాలు చేపడుతున్నారు. ఒక పోస్టుని నోటిఫై చేస్తే.. ఇద్దరిని నియమించారు. డిప్యుటేషన్ అవకాశమే లేకున్నా.. డిప్యుటేషన్ పేరుతో నియామకాలు జరు గుతున్నాయి. ఆ బాబు చెప్పారు.. ఈ బాబు చెప్పా రు, ఎమ్మెల్యే బంధువు అని రకరకాల సాకులు చెప్పి ఇష్టారాజ్యంగా నియమాకాలు చేపడుతున్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంగా తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నెలకొల్పిన స్విమ్స్ రాజకీయ జోక్యంతో అస్తవ్యస్తంగా మారిపోతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక వైద్యాలయం పచ్చగద్దల అనుచరులకు పునరావాస కేంద్రంగా మార్చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టీటీడీపై ఒత్తిడి తెచ్చి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయించారు. ఆపై ఇష్టారాజ్యంగా నియామకాలు చేపట్టారు. ఈ నియామకాల వెనుక రూ.కోట్లు చేతులు మారాయాయనే ప్రచారం జరుగుతోంది. స్విమ్స్‌లో జరిగేవాటిలో మచ్చుకు కొన్ని..
నిబంధనలకు నీళ్లు
స్విమ్స్ నియామకాల్లో ఎన్‌ఎంసీ నిబంధలను పాటించటం లేదు. పేతాలజీ విభాగంలో ఖాళీలు లేకపోయినా రెండు ప్రొఫెసర్ పోస్ట్‌లు భర్తీ చేశారు. అది కూడా ఒక పోస్టుకి నోటిఫికేషన్ ఇచ్చి ఇద్దరిని నియమించారు. ఈ నియామకంలో కూడా నిబంధనలు పాటించలేదు. కనీస అర్హత లేకపోయినా పైరవీలకు పెద్దపీట వేసి నియామకాలు చేపట్టారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లు అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తేనే ప్రొఫెసర్ పోస్ట్‌కు అర్హత వస్తుంది. ఇది నియామక నోటిఫికేషన్‌లో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ అర్హత లేకపోతే స్క్రూటినీలోనే ఆగిపోవాలి. కానీ ఓ డాక్టర్ అప్లికేషన్ మాత్రం ’కనీస అర్హత’ నిబంధన ఆపలేకపోయింది. చినబాబు పేరు చెప్పి ఇంటర్వ్యూ వరకు, ఆ తర్వాత నియామకం కూడా జరిగిపోయింది. ప్రొఫెసర్‌గా కనీస అర్హత లేకుండానే ప్రొఫెసర్ అయిపోయారనే ఆరోపణలు గుప్పమన్నాయి. మరొక పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వకపోయినా.. ఓ ఎమ్మెల్యే మేనకోడలు కావడంతో ఆమె నియమాకం కూడా జరిగిపోయినట్లు స్విమ్స్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ విభాగంలో ఖాళీ లేకపోయిన, అర్హత అసలే లేకపోయినా ప్రొఫెసర్ అయిపోయారు. అలాగే ఓ మంత్రి అండదండలున్న మరో డాక్టర్ నియామకం కూడా అంతే. కనీస అర్హతలు లేకుండానే ప్రొఫెసర్ అయిపోయారు. ఇలా కనీస అర్హతలు లేకుండా ప్రొఫెసర్లు అయిపోయిన వారు డాక్టర్లని ఎలా చేస్తారనే ప్రశ్నకు స్విమ్స్ అధికారుల బరితెగింపే సమాధానంగా వస్తోంది. డిప్యుటేషన్‌పై నియమించుకునే అవకాశమే లేకపోయినా.. నిబంధనలకు విరుద్ధంగా నియమాకాలు చేసుకుంటున్నారు. స్విమ్స్‌కి అత్యవసరం అయితే కాంట్రాక్టు పద్ధతిన అప్పటికప్పుడు నియమించుకునే అవకాశం ఉంది. అలా నియమించుకున్న వారిని కొనసాగించాలంటే ప్రతి ఆరు నెలలకొకసారి ఎగ్జిక్యుటివ్ కమిటీ ద్వారా చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఇటువంటి నిబంధనలేవీ పాటించుకుండా.. స్విమ్స్‌లో నియమాకాలు చేపడుతున్నారు. ఇలా కనీస అర్హత లేని వారిని నియమిస్తే రేపు వారి కారణంగా అమాయకులు ప్రాణాలకు ముప్పు కలిగితే ఎవరు బాధ్యత వహిస్తారని స్విమ్స్ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఎన్‌ఎంసీ తనిఖీల్లో ఇది బయట పడితే.. ఆయా స్పెషలైజేషన్స్‌లో సీట్లు కోల్పోయే ప్రమాదం కూడా లేకపోలేదని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. నియామకాల్లో పైరవీలు, పైసా వసూళ్ల ప్రభావం విద్యార్థుల మీద పడుతుందన్న భయం స్విమ్స్ అధికారులకు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
