 
															షార్‌లో నేడు ఎంఆర్‌ఆర్ సమావేశం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగవేదిక నుంచి నవంబర్ 2వ తేదీ సాయంత్రం 5.26 గంటలకు ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్ ద్వారా సీఎంఎస్–03 అనే సమాచార ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ ప్రయోగానికి సంబంఽధించి మిషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ప్రయోగవేదిక మీదున్న రాకెట్‌కు అన్ని పరీక్షలు పూర్తి చేసి శుక్రవారం షార్‌లోని బ్రహ్మప్రకాష్‌హాలులో మిషన్ రెడీనెస్ రివ్యూ (ఎంఆర్‌ఆర్) సమావేశం నిర్వహించనున్నారు. కాగా రాకెట్ అంతా సిద్ధం చేసి పరీక్షలు చేసిన అనంతరం ఎంఆర్‌ఆర్ సమావేశం నిర్వహించి ప్రయోగ పనులను లాంచ్ ఆథరైజేషన్ బోర్డు (లాబ్) వారికి అప్పగిస్తారు. లాబ్ చైర్మన్ ఈఎస్ పద్మకుమార్ ఆధ్వర్యంలో లాంచ్ రిహార్సల్స్ నిర్వహించి ప్రయోగానికి సంబంఽధించి కౌంట్‌డౌన్ సమయాన్ని, ప్రయోగ సమయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. అయితే నవంబర్ 2న సాయంత్రం 5.26 గంటలకే ప్రయోగ సమయాన్ని నిర్దేశించుకున్నారు. ఈ సమయం మారే అవకాశం కూడా లేకపోలేదు. ప్రయోగానికి 26 గంటల ముందు అంటే నవంబర్ 1న సాయంత్రం 3.26 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించి అవకాశం ఉండొచ్చు. ఈ ప్రయోగంలో 4,400 కిలోలు బరువు కలిగిన సీఎంఎస్–03 అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపేందుకు అంతా సిద్దం చేశారు.
16.09 నిమిషాల్లో ప్రయోగం
ఎల్‌వీఎం3–ఎం5 రాకెట్ ప్రయోగాన్ని 16.09 నిమిషాల్లోనే ప్రయోగాన్ని పూర్తి చేసేలా శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. 43.5 మీటర్లు పొడవు కలిగిన ఎల్‌వీఎం3 రాకెట్ ప్రయోగ సమయంలో 642 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి పయనమవుతుంది. 4,400 కిలోలు బరువు కలిగిన సీఎంఎస్–03 ఉపగ్రహాన్ని భూమికి దూరంగా 29,970 కిలోమీటర్లు, భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు ఎత్తులోని జియో ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు. అనంతరం ఉపగ్రహాల నియంత్రణ కేంద్రమైన హసన్‌లోని శాస్త్రవేత్తలు ఉపగ్రహంలోని అపోజి ఇంధనాన్ని మండించి దశల వారీగా అంటే మూడు నాలుగు విడుతల్లో భూమికి 36 వేలు కిలోమీటర్లు ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
