గ్రీవెన్స్ రద్దు
తిరుపతి అర్బన్: తుపాన్ నేపథ్యంలో కలెక్టరేట్‌లో సోమవారం గ్రీవెన్స్ రద్దు చేస్తున్నట్లు రెండు రోజులకు ముందే అధికారులు మీడియా ద్వారా తెలియజేశారు. అయినా పలు సమస్య లు పరిష్కారం కాకపోవడంతో అర్జీదారులు పలువురు సోమవారం కలెక్టరేట్‌కు విచ్చేశారు. తుపాన్‌పై పదేపదే కలెక్టర్ అధికారులతో మాట్లాడుతూ బిజీగా ఉన్నప్పటికీ అర్జీదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పి పంపించారు.
కలెక్టర్ ఆదేశాలు
పాటించకుంటే కఠిన చర్యలు
తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు మోంథా తుపాన్ నేపథ్యంలో కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని డీఈఓ కేవీఎన్ కుమార్ హెచ్చరించారు. మంగళ, బుధవారాల్లో అన్ని పాఠశాలలకు కలెక్టర్ సెలవులు ప్రకటించారని, ఆయన ఆదేశాలను పాటించని విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు జరిమానాలను విధిస్తామని చెప్పారు. సోమవారం కొన్ని పాఠశాలలు తరగతులు నిర్వహించినట్లు తమ దృష్టికి వచ్చిందని యాజమాన్యాలపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 8 కంపార్ట్‌మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 80,021 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 25,894 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.90 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవాడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలోకి అనుమతించరని స్పష్టం చేసింది.


