తిరుపతి రైల్వేస్టేషన్ రూపురేఖలు మారనున్నాయ్
తిరుపతి అన్నమయ్యసర్కిల్:మరో రెండేళ్లలో తిరుపతి రైల్వేస్టేషన్ రూపురేఖలు మారనున్నాయని సికింద్రాబాద్ సెంట్రల్ ప్యాసింజర్ సేవల విభాగం కమర్షియల్ మేనేజర్ (సీసీఎం) డి.సత్యనారాయణ వెల్లడించారు. ప్రయాణికుల భాగస్వామ్యంతో రైల్వేష్టేషన్ అభివృద్ధికి చర్యలు తీసుకోవడంతోపాటు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. గురువారం స్థానిక రైల్వేస్టేషన్‌లోని వీఐపీ విశ్రాంత భవనంలో ‘అమృత్ సంభాషణ– ప్రజల స్వరమే అభివృద్ధి శక్తి’ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రైల్వే అమలు చేస్తున్న అమృత్ భారత్ స్టేషన్ పథకంలో తిరుపతి స్టేషన్ కూడా ఒక్కటన్నారు. ఈ రైల్వేస్టేషన్ అభివృద్ధిలో భాగంగా ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలు, సూచనలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. తిరుపతి స్టేషన్‌న్‌ను మరింత సుందరంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. బాలజీ డివిజన్‌గా పరిగణించాలనే డిమాండ్‌తోపాటు సామాన్యులను దృష్టిలో ఉంచుకుని, అదనపు జనరల్ బోగీలను ఏర్పాటు చేయాలనే సలహాలు, అభిప్రాయాలను కేంద్ర రైల్వేశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతామని హామీ ఇచ్చారు. ముందుగా సదస్సుకు హాజరైన తిరుపతి వాసులు బుజ్జిబాబు, రామిరెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డి, అనిల్‌గౌర్, మురళి, శేషగిరిరావు, మునీశ్వరరెడ్డి, యాసిన్, అరవ జయపాల్ వేర్వేరుగా మాట్లాడుతూ స్టేషన్ అభివృద్ధికి సంబంధించి లోపాలను ఉదహరిస్తూ శాఖా పరంగా చేపట్టాల్సిన అంశాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రైల్వేస్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ, మేనేజర్ చిన్నపరెడ్డి, సీసీఆర్‌ఐ శ్రీకాంత్, సీనియర్ కమర్షియల్ క్లర్క్ అరుణ తదితరులు పాల్గొన్నారు.


