తుపాను ప్రమాదం.. అప్రమత్తం
తిరుపతి అర్బన్ : మోంథా తుపాను ముంచుకొస్తోందని అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. శనివారం తన నివాసం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ మౌర్య, డీఆర్‌ఓ నరసింహులు ఇతర అధికారులు వారి కార్యాలయాల నుంచి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు జిల్లా వ్యాప్తంగా కురవనున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా 27,28,29 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని సమాచారం ఉందని తెలిపారు. ఈ క్రమంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా పీజీఆర్‌ఎస్‌ను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. లోతట్టు ప్రాంతాలను ముందే గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించాలని కోరారు. కలెక్టరేట్ కంట్రోల్ రూమ్‌కు 0877–2236007 ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాగాన్నిఅప్రమత్తం చేసినట్లు చెప్పారు. జేసీ మౌర్య మాట్లాడుతూ వర్షాలకు ముందే తగు చర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.


