నాగలాపురంలో మహిళ హత్య
నాగలాపురం: స్థానిక బీసీ కాలనీలో నివసిస్తున్న మునిలక్ష్మి (55) అనే మహిళ శనివారం దారుణ హత్యకు గురైంది. వివరాలు.. భర్త మరణించడంతో మునిలక్ష్మి ఒంటరిగానే జీవనం సాగిస్తోంది. ఓ హోటల్లో పనిచేసుకుంటూ పొట్టపోసుకునేది. శుక్రవారం యథావిధిగానే హోటల్‌కు వెళ్లి తిరిగి రాత్రి ఇంటికి చేరుకుంది. శనివారం ఉదయం హోటల్‌కు రాక పోవడంతో యజమాని పక్కింటి వాళ్లకి ఫోన్ చేశాడు. వారు ఆమె కోసం వెళ్లగా ఇంట్లో మునిలక్ష్మి విగత జీవిగా పడివుంది. గొంతు వద్ద గాయం ఉండడంతో పోలీసులకు సమాచారం అందించారు. డీఎస్పీ రవికుమార్, సీఐ రవీంద్ర, ఎస్‌ఐ సునీల్, శిక్షణ ఎస్‌ఐ ప్రసాద్, పిచ్చాటూరు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు , తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బంగారం కోసమేనా..?
మునిలక్ష్మి మెడలో బంగారు గొలుసు, చేతికి వేలుకి ఉన్న ఉంగరం కోసమే ఆమెను హత్య చేసి ఉంటారని స్థానికులు అభిప్రాయ పడుతున్నారు. శుక్రవారం రాత్రి ఒక మహిళ, పురుషుడు ఆమె ఇంట్లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. మునిలక్ష్మిని హత్య చేసి ఆనవాళ్లు చెరిపేసేందుకు ఇంట్లో కారప్పొడి సైతం చల్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు డాగ్ స్క్వాడ్, వేలి ముద్ర నిపుణులు ఘటనాస్థలంలో ఆధారాలు సేకరించారు.
నాగలాపురంలో మహిళ హత్య


