రొమ్ము క్యాన్సర్‌కు అత్యాధునిక చికిత్స
తిరుపతి తుడా: రొమ్ము క్యాన్సర్‌కు స్విమ్స్ ఆస్పత్రిలో అత్యాధునిక చికిత్స అందిస్తున్నామని డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ తెలిపారు. ఈ మేరకు స్విమ్స్ పద్మావతి ఆస్పత్రి మెడికల్ అంకాలజీ విభాగం ఆధ్వర్యంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆర్వీ కుమార్ మాట్లాడుతూ మహిళలు రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన పెంచుకుని వైద్యులు సూచించిన విధంగా తరచు స్వీయపరీక్ష చేసుకోవాలని, ఏదైనా అనుమానం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం, తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో క్యాన్సర్‌పై అవగాహన, స్క్రీనింగ్ కార్యక్రమాలను యుద్ధప్రాతిపదిక నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇందులో భాగంగా రెండు పింక్ బస్సుల ద్వారా ఇప్పటివరకు 713 క్యాంపులు నిర్వహించి, దాదాపు 42 వేల మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని, దాదాపు 3 వేల మంది అనుమానితులను గుర్తించి 895 మందికి క్యాన్సర్ వైద్యం అందించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ అపర్ణ ఆర్ బిట్లా, డాక్టర్ భార్గవి, డాక్టర్ సుబ్రమణ్యన్, డాక్టర్ విజయలక్ష్మి, వైద్యులు పాల్గొన్నారు.


