అధికారులు అప్రమత్తంగా ఉండాలి
తిరుపతి అర్బన్: ఈశాన్య రుతుపవనాలతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులు, డీఆర్వో నరసింహులుతో కలిసి వర్షాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వర్షంతో ఇబ్బందులుంటే వెంటనే కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 0877–2236007 నంబర్‌కు సమాచారం ఇ వ్వాలని సూచించారు. అలాగే రెవెన్యూ డివిజన్ కార్యాలయాలు, మండల తహసీల్దార్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వర్షాలు పడుతున్న తరుణంలో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కారించడానికి అధికారులు సమష్టిగా పనిచేయాలని పేర్కొన్నారు. ప్రధానంగా తిరుపతి మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించి, వరదనీరు పంపించే వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే అవసరం అయితే సహాయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని చెప్పారు. డీఎంహెచ్‌ఓ ఆధ్వర్యంలో ఆరోగ్యశాఖ వ్యాధులు సోకకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో ఆ విభాగానికి చెందిన జేడీ ఆధ్వర్యంలో సంరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ రైతులకు సరైన అవగాహన కల్పించాలన్నారు. ప్రధానంగా పాఠశాల, అంగన్‌వాడీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాలకు చెందిన పాత భవనాలను పరిశీలించి, ప్రమాదకరమైన స్థితి ఉంటే తగు జాగ్రత్తలు చేపట్టాలని స్పష్టం చేశారు. అన్ని విభాగాలకు చెందిన అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.
అత్యధికంగా వాకాడులో 104.6 మి.మీ.
జిల్లాలో 117.6 మిల్లీమీటర్ల వర్షపాతం మంగళవారం నమోదైనట్లు సీపీఓ కార్యాలయ అధికారులు వెల్లడించారు. అయితే సరాసరిగా జిల్లాలో 32.9 మిల్లీమీటర్లుగా పేర్కొన్నారు. ప్రధానంగా వాకాడు మండలంలో 104.6 మి.మీ, సూళ్లూరుపేటలో 74.4 మి.మీ, ఓజిలిలో 62.8 మి.మీ, కోటలో 56.6 మి.మీ, దొరవారిసత్రంలో 53.8 మి.మీ, చిట్టమూరులో 53.6 మి.మీ, ఎర్రావారిపాళెంలో 5.2 మి.మీ, నారాయణవనంలో 4.6 మి.మీటర్ల నమోదైనట్లు పేర్కొన్నారు.


