తీరంలో రెడ్ అలర్ట్
వాకాడు: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారడంతో దీని ప్రభావంతో వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో మంగళవారం అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. దాదాపు 5 నుంచి 7 మీటర్లు ఎత్తుకు ఎగసి పడుతూ సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఈ తరుణంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, సముద్రంపై వేటకు ఎవరూ వెళ్లవద్దని మత్స్యశాఖ అభివృద్ధి అధికారి రెడ్డి నాయక్ ఆదేశించారు. మండలంలోని సముద్ర తీర మత్స్యకార గ్రామాలైన తూపిలిపాళెం, కొండూరుపాళెం, దుగ్గరాజపట్నం, అంజలాపురం, శ్రీనివాసపురం, ఓడపాళెం, వైట్‌కుప్పం, మొనపాళెం, చినతోట, పూడికుప్పం, పూడిరాయిదొరువు, నవాబుపేట గ్రామాల వద్ద హోరుగాలితోపాటు భారీ వర్షంతో సముద్రం ఉధృతంగా ఎగసి పడుతుంది. మత్స్యకారులు ముందస్తు జాగ్రత్తగా రెండు రోజుల ముందుగానే వేటకు పోవడం మానుకున్నారు. తమ వేట సామగ్రిని ఒడ్డున భద్రపరిచి బోట్లకు లంగరు వేశారు. ఈ ఏడాది వేట నిషేధం తరువాత గత నాలుగు నెలల నుంచి అల్పపీడనాలు, వాయుగుండాలతో చేపల వేట సక్రమంగా జరగడం లేదు. దాదాపు ఈ నాలుగు నెలల్లో 45 రోజులుపాటు వేట నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మత్స్యకారులు పూట గడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తీరంలో రెడ్ అలర్ట్


