
ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పోరాటం
వైఎస్సార్‌సీపీలో యువతే కీలకం కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి పార్టీ యువజన విభాగం నాయకులతో భూమన అభినయ్‌రెడ్డి
తిరుపతి మంగళం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో యువతే కీలకమని పార్టీ అభ్యున్నతికి తీవ్రంగా కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని పార్టీ యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్, తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం అన్నమయ్య, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల వైఎస్సార్‌సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా భూమన అభినయ్‌రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుందన్నారు. అయితే కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను యువత ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఇంత వరకు ఏ ఒక్కటీ సక్రమంగా నెరవేర్చలేదన్నారు. ప్రజా సంక్షేమం, ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఉద్యమ, పోరాటాలు చేపట్టాలని యువతకు భూమన అభినయ్‌రెడ్డి సూచించారు. యువతకు కూటమి ప్రభుత్వం ఇస్తానన్న 20 లక్షల ఉద్యోగాలు, రూ. 3 వేలు నిరుద్యోగ భృతి అందిస్తానని కూటమి ప్రభుత్వం యువతను దారుణంగా మోసగించిందన్నారు. యువతను మోసగించిన కూటమి ప్రభుత్వానికి యువతే బుద్ధి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మల్లం రవికుమార్, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఉదయ్‌వంశీ, శివ (అన్నమయ్య జిల్లా), నాగార్జున (నెల్లూరు జిల్లా), పార్టీ యువజన విభాగం నగర అధ్యక్షుడు దినేష్‌రాయల్, మైనార్టీ విభాగం నాయకులు షేక్ ఇమ్రాన్‌బాషా పాల్గొన్నారు.