
భారత యువత ప్రపంచాన్ని శాసిస్తోంది
తిరుపతి సిటీ : భారత దేశంలో యువత ఆధునిక సాంకేతి విజ్ఞానాన్ని విరివిగా వినియోగించుకుంటూ ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి ఎదుగుతోందని నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యులు, ఏపీ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ సతీష్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు మోటివేషన్ కార్యక్రమంలో భాగంగా జరిగిన ఇన్‌స్పైరింగ్ మైండ్స్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థుల నుద్ధేశించి ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ఆయుధాలను దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసే స్థాయికి భారత్ ఎదగడం గర్వకారణమన్నారు. దేశంలో విద్యా ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని, దీంతో ప్రతి ఏడు 15 లక్షల మంది ఇంజినీరింగ్ విద్యార్థులు వివిధ కళాశాల నుంచి పట్టాలు పొంది ఉన్నత స్థాయిలో 90శాతం మంది ఉద్యోగాలు సాధిస్తున్నారని తెలిపారు. అతిపెద్ద ఆర్థిక దేశంగా రాబోయే రోజుల్లో ప్రపంచం ముందు భారతదేశం ఆవిష్కృతం కానుందని చెప్పారు. కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ఆలోచన శక్తి పెంచుకోవాలన్నారు. సమయం చాలా విలువైనదని, ఉన్నత లక్ష్యాలను ఎంపిక చేసుకుని ఆ దిశగా విద్యార్థులు శ్రమించాలన్నారు. అనంతరం డాక్టర్ సతీష్ రెడ్డిని కళాశాల యాజమాన్యం ఘనంగా సత్కరించింది. కార్యక్రమంలో కళాశాల అకడమిక్ డైరెక్టర్ మన్నెం అరవిందుకుమార్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ వాసు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.