రోడ్డుకు అడ్డంగా గోడ
పెళ్లకూరు: పెళ్లకూరు మండలం, శిరసనంబేడు గ్రామం మీదుగా అమ్మన్ ట్రై స్టీల్ పరిశ్రమకు వెళ్లే రహదారికి అడ్డంగా గ్రామానికి చెందిన టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు వేలూరు మురళికృష్ణారెడ్డి మంగళవారం ఏకంగా గోడ కట్టి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించారు. స్థానికుల సమాచారం మేరకు.. పదిహేనేళ్లు కిందట గ్రామంలో స్టీల్ పరిశ్రమ నెలకొల్పారు. పరిశ్రమ వాహనాలు గ్రామంలోని ప్రధాన వీధి గుండా రాకపోకలు సాగిస్తుండడం వల్ల లారీ కింద పడి ఓ బాలుడు మృతి చెందాడు. అప్పటి నుంచి ప్రధానవీధి గుండా పరిశ్రమ వాహనాలు రాకుండా నిలిపేశారు. ఆ సంస్థ తాత్కాలికంగా వేరే రహదారి ఏర్పాటు చేసుకుంది. ఈ మార్గాన్ని ఆనుకొని ఓ వెంచర్ ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన పట్టా భూముల్లో రోడ్డు ఏర్పాటు చేసినట్లు, నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలని కొందరు బాధితులు ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో నిర్వాసితులకు పరిశ్రమ యాజమాన్యం అడ్వాన్స్ అందజేసినట్లు సమాచారం. ఈ పరిహారం విషయంలో గ్రామానికి చెందిన నిర్వాసితుల మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. ప్రస్తుతం వెంచర్ యాజమాన్యం తాత్కాలిక రోడ్డును బీటీ రోడ్డుగా అభివృద్ధి చేశారు. పూర్తి స్థాయి పరిహారాన్ని వెంటనే చెల్లించాలంటూ టీడీపీ నాయకుడు మురళీకృష్ణారెడ్డి పట్టుబట్టారు. వాహనాల రాకపోకలు జరగకుండా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టించారు. ఈ విషయమై గ్రామంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


