పోలీసు వ్యవస్థకు చెడ్డపేరు తీసుకురావొద్దు
తిరుపతి క్రైమ్ : పోలీసు వ్యవస్థకు చెడ్డ పేరు తీసుకురావద్దని, ఎవరైనా పోలీసులు తప్పు చేయాలంటే వారి వెనకాల కుటుంబం ఉందని గుర్తు చేసుకోవాలని ఎస్పీ హర్షవర్ధన్ రాజు పేర్కొన్నారు. శుక్రవారం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏఆర్ పోలీసు సిబ్బందితో పరేడ్ నిర్వహించారు. పోలీసులలో ఏ ఒక్క పోలీసు తప్పు చేసిన దాని ప్రభావం పోలీసులందరి మీద పడుతుందన్నారు. ఏదైన సమస్య ఉంటే నా దృష్టికి తీసుకొస్తే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా తప్పు చేస్తే... చర్య లు మాత్రం చాలా సీరియస్‌గా ఉంటాయన్నా రు. ఎవరైనా తప్పుడు పనులు చేస్తుంటే పోలీసు ఉద్యోగం వదలిపెట్టాలన్నారు. పోలీసు ఉద్యోగంలో ఉండి తప్పు చేస్తే.. మాత్రం ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
9న షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానోత్సవం
తిరుపతి ఎడ్యుకేషన్ : తిరుపతిలోని మహతీ ఆడిటోరియంలో ఈనెల 9వ తేదీన షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రధానోత్సవం కలెక్టర్, ఇన్‌చార్జ్ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు డీఈఓ కేవీఎన్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 2024–25 విద్యా సంవత్సరంలో పది, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి విద్యార్థికి రూ.20 వేలు నగదు, ప్రశంసా పత్రం, పతకం అందించనున్నట్లు డీఈఓ తెలిపారు.
శ్రీవారి దర్శనానికి
15 గంటలు
తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లో కంపార్ట్‌మెంట్లు నిండాయి. గురువారం అర్ధరాత్రి వరకు 67,284 మంది స్వామి వారిని దర్శించుకోగా 31,268 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.34 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 15 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలైన్లో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
25 నుంచి
డిగ్రీ ఇన్‌స్టెంట్ పరీక్షలు
తిరుపతి సిటీ : ఎస్వీయూ పరిధిలో 2022–23 బ్యాచ్ డిగ్రీ 5వ సెమిస్టర్ రెగ్యులర్‌గా చదవి పరీక్షలలో తప్పిన విద్యార్థులకు ఈనెల 25వ తేదీ నుంచి ఇన్‌స్టెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ రాజమాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈనెల 16వ తేదీలోపు పరీక్ష ఫీజును చెల్లించాలన్నారు. రూ.1500 అపరాధ రుసుముతో 18 వరకు, రూ.3500 అపరాధ రుసుముతో ఈనెల 20వ తేదీలోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
యూపీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
– రేపు ఇంజినీరింగ్ సర్వీసెస్ పరీక్ష
తిరుపతి అర్బన్: యూపీఎస్సీకి చెందిన ఇ–ఇంజినీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ)పరీక్షకు పటిష్టమైన ఏర్పాట్లు చేపట్టాలని డీఆర్వో నరసింహులు తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆయన పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో రెండు పరీక్షా కేంద్రాల్లో 791 మంది అభ్యర్థులు హజరు కానున్నారని వెల్లడించారు. పేపర్–1 పరీక్ష ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, పేపర్–2 పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్షకు అభ్యర్థులు గుర్తింపుకార్డు తెచ్చుకోవాలని సూచించారు. తిరుపతిలోని రెండు పరీక్షా కేంద్రాలైన తిరుచానూరు రోడ్డు లక్ష్మీపురం సర్కిల్ సమీపంలోని ఎస్‌డీఎస్ ఆర్ట్స్ కళాశాల, బాలాజీ కాలనీ, వెస్ట్ చర్చిరోడ్డు మార్గంలోని శ్రీ పద్మావతి బాలికల ఉన్నత పాఠశాల వద్ద భద్రతా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో యూపీఎస్సీ అబ్జర్వర్ న్యూఢిల్లీ నుంచి విచ్చేసిన కిరణ్ కర్లా అరోరాతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.


