
జాతరలో నిర్లక్ష్యం!
● భారీగా భక్తులు వస్తారని తెలిసినా శ్రద్ధపెట్టని అధికారులు ● వీఐపీలు, సామాన్య భక్తులకు ఒకే క్యూలైన్ ● తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరలో తోపులాట ● భయపడి అమ్మవారిని దర్శనం చేసుకోక వెనుదిరిగిన భక్తులు ● ముందస్తు జాగ్రత్తలు తీసుకోని అధికారులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతరలోనూ తోపులాట తప్పలేదు. నిర్వహణ లోపంతో వేల మంది భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చిన్నారులతో వచ్చిన భక్తులు తోపులాటను చూసి అమ్మవారిని దర్శనం చేసుకోకనే వెనుదిరిగారు. తిరుపతిలో ఏటా మే నెల మొదటి వారంలో నిర్వహించే తాతయ్య గుంట గంగమ్మ జాతర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో విశిష్టమైనది. గంగమ్మ జాతరను దృష్టిలో ఉంచుకుని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించి వైభవంగా నిర్వహించింది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలను తలపించేలా వారం రోజుల పాటు జాతరను జరిపించారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక మొదటి సారి నిర్వహించిన గంగమ్మ జాతరను తూతూ మంత్రంగా నిర్వహించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గంగమ్మ జాతరలో అతి ముఖ్యమైన రోజైన మంగళవారం అధికార యంత్రాంగం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే కూటమి ప్రభుత్వం గంగమ్మ జాతర నిర్వహణపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందని భక్తులు మండిపడుతున్నారు. అమ్మవారి దర్శనం కోసం మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా తోపులాట చోటు చేసుకుంది. తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల పంపిణీలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన గుర్తుకొచ్చి భక్తులు అనేక మంది అమ్మవారి దర్శనం చేసుకోకనే వెనుదిరిగి వెళ్లిపోవటం కనిపించింది. ఆలయం వద్ద వీఐపీలు, సామాన్య భక్తులు రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అయితే అందరూ ఒకే క్యూలైన్లోకి ప్రవేశించడంతో భక్తుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎండ వేడిమికి ఊపిరి ఆడక చిన్నారులు, మహిళలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మంగళవారం రాత్రి కూడా వీఐపీలు, సామాన్య భక్తులు ఒకే క్యూలైన్ ద్వారా లోనికి అనుమతించటంతో భక్తుల మధ్య మరోసారి తోపులాట చోటు చేసుకుంది. పలు ప్రాంతాల నుంచి మహిళలు పొంగళ్లు పెట్టేందుకు తరలిరాగా స్థలం లేక అనేక మంది మహిళలు వెనుదిరిగి వెళ్లిపోవటం కనిపించింది. మొత్తంగా తాతయ్య గుంట గంగమ్మ జాతర నిర్వహణపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

జాతరలో నిర్లక్ష్యం!

జాతరలో నిర్లక్ష్యం!

జాతరలో నిర్లక్ష్యం!

జాతరలో నిర్లక్ష్యం!