
చెరువులనూ వదల్లేదుగా..
● ప్రకృతిని చెరబడుతున్న కూటమి నేతలు ● ఇటీవలి వరకు ప్రభుత్వ భూముల్లో గ్రావెల్ తరలింపు.. ● ఇప్పుడు చెరువులను తోడేస్తున్న వైనం ● మామూళ్ల మత్తులో అధికారులు
దొరవారిసత్రం : మండల పరిధిలో నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ భూముల్లో విలువైన గ్రావెల్‌ను అక్రమంగా తరలించి కూటమి నాయకులు రూ.లక్షలు వెనుకేసుకున్నారు. అంతటితో ఆగని వారి ధనదాహం ఇప్పుడు గ్రామాల్లోని చెరువుల వైపు మళ్లింది. రాత్రికి రాత్రే టిప్పర్లు, లారీల్లో విలువైన గ్రావెల్‌ను తరలించి రూ.లక్షలు దోచుకుంటున్నారు. ఇదంతా కళ్లెదుటే జరుగుతున్నా.. అడ్డుకోవాల్సిన రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసులు శాఖలు చోద్యం చూస్తుండడంతో గ్రామీణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎక్కడెక్కడంటే..
నెలబల్లి, నెల్లూరుపల్లి, కల్లూరు తదితర గ్రామాల్లోని ఇరిగేషన్ పరిధిలో ఉన్న చెరువుల్లో ఇష్టారీతిన అక్రమంగా గ్రావెల్ తరలించడంతో భారీగా గోతులు ఏర్పడ్డాయి. గత మూడు రోజుల నుంచి నెలబల్లి గ్రామ పరిధిలోని సుమారు 350 ఎరాలకు సాగు నీరు అందించే నెలబల్లి పెద్దచెరువులో రాత్రి సమయంలో గుట్టు చప్పుడు కాకుండా స్థానికంగా ఉన్న కొందరు కూటమి నేతలు యంత్రాలతో తోడి ట్రాక్టర్లతో విలువైన గ్రావెల్‌ను బయట ప్రాంతాలకు తరలించి భారీ మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికంగా ఎవరైనా అడ్డుకుంటే ఇళ్లకు గ్రావెల్ తరలిస్తున్నామని బుకాయిస్తున్నారు. మరోవైపు నియోజకవర్గానికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి పేరు చెప్పుకుంటూ కూటమి నేతలు అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే కళ్లెదుటే గ్రావెల్ తరలిస్తున్నా..అడ్డుకోవాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి.