
తిరుపతి బస్టాండ్ నుంచే ప్రక్షాళన
● అధికారులతో డీపీటీఓ వెంకట్రావ్ తొలి సమావేశం
తిరుపతి అర్బన్: తిరుపతి బస్టాండ్ నుంచే ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాలని జిల్లా ప్రజా రవాణా అధికారి (డీపీటీఓ) వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన తిరుపతి బస్టాండ్‌ను పరిశీలించారు. అనంతరం ఏటీఎం చాంబర్‌లో అధికారులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ శ్రీహరి బస్టాండ్‌లో కొంతభాగాన్ని త్వరలో తొలగించనున్న నేపథ్యంలో ఆర్టీసీ కార్గో కార్యాలయాన్ని ఏ ప్రాంతానికి మార్పు చేస్తే బాగుంటుంది ? అలాగే ఈ ప్లాట్‌ఫాంల్లో ఆగుతున్న బస్సులను ఎక్కడ కేటాయిస్తే ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుందనే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం ఈ నెల చివరికల్లా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఏ ప్లాట్‌ఫాంలో బస్సు ఆగుతుందో అక్కడి నుంచే ఆటోమేటిక్ అనౌన్స్‌మెంట్ ఇచ్చేలా తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. తిరుపతి బస్టాండ్ పరిశుభ్రత విషయంలో జిల్లాలోని అన్ని బస్టాండ్లకు ఆదర్శంగా ఉండాలని సూచించారు. ప్రతి దుకాణదారుడు డస్ట్‌బిన్ ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఎమ్మార్పీ ధరలకే వస్తువులు విక్రయించాలన్నారు. ఆర్టీసీలోని ప్రతి ఉద్యోగి నిబద్ధతతో పని చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలో తిరుపతి జిల్లాలోనే అత్యధికంగా 11 ఆర్టీసీ డిపోలో ఉన్నాయని, మన జిల్లాను రాష్ట్రానికే మార్గదర్శకంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డెప్యూటీ చీప్ ట్రాఫిక్ మేనేజర్ విశ్వనాథం, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ డీఆర్ నాయుడు, ఆర్టీసీ ఇంజినీరింగ్ అధికారులు చెన్నకేశవులు,లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.