
తిరుపతిలో జోరుగా అక్రమ నిర్మాణాలు
● నిబంధనలకు విరుద్ధంగా భారీ భవనాలు ● ఇదే అదునుగా రెచ్చిపోతున్న లంచావతారులు ● కాసులిస్తే ఇష్టారాజ్యంగా అనుమతులు ● చేయి తడపకుంటే తప్పని అడ్డగింతలు ● పర్యవేక్షణను గాలికి వదిలేసిన ఉన్నతాధికారులు
తిరుపతి తుడా : తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు విమర్శలకు తావిస్తోంది. నగరంలో గడిచిన మూడు నెలల్లోనే 600 మందికి పైగా భవన నిర్మాణదారులకు ప్లానింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ భవనాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో ప్లానింగ్ సెక్రటరీలు రంగలోకి దిగేశారు. నోటీసులు జారీచేసిన భవనాల వద్దకు వెళ్లి ఎక్కడికక్కడ పనులు నిలిపే వేయాలని హుకుం జారీ చేశారు. ఒకసారి ఆఫీసుకు వెళ్లి మా సార్ ను కలవండి .. మీరు ఏదైనా మాట్లాడుకోవాలి అంటే అక్కడే మాట్లాడుకోండి. అప్పటివరకు పనులు చేయొద్దు అంటూ భవన యజమానులను ఆదేశించారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో భవన యజమానులు గడిచిన మూడు నెలలుగా ప్లానింగ్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో భవనాల డిమాండ్ మేరకు కాసులు ఇచ్చుకున్న వారికి అధికారుల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వారి నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసుకుంటున్నారు. కొంతమంది భవన యజమానులు రాజకీయ నేతలను ప్రసన్నం చేసుకుని, అధికారులకు కూడా కాస్త మామూళ్లు చదివించుకుని పనులు సాగిస్తున్నారు. ఈ అవినీతి తంతు తెలియని మరి కొందరు యజమానులు ఇప్పటికీ పనులు చేసుకోలేక కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి పనికీ డబ్బులతో ముడిపెడుతుండడంతో భవన నిర్మాణాల చేపట్టాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. అడిగినంత ఇవ్వకుంటే ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపుతూ భవన యజమానులను ఇబ్బందులు పెడుతున్నారు. తమకు సహకరిస్తే ఎన్ని అంతస్తులైనా నిర్మించుకోవచ్చు అని టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మొహమాటంగా చెబుతున్నారు.
తిరుపతి నగరంలో ఇలాంటి ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. టౌన్ ప్లానింగ్ నిబంధనలకు విరుద్ధంగా వందలాది భవనాలు నిర్మిస్తూనే ఉన్నారు. రూ.లక్షలు ముట్టజెపుతున్న వారికి మాత్రం అధికారులు కొమ్ముకాస్తున్నారు. డబ్బులు ఇవ్వని వారి నిర్మాణ పనులను అడ్డుకుంటున్నారు. కొన్ని చోట్ల కట్టడాలను పడగొట్టేస్తున్నారు. అయితే కాసులిస్తే మాత్రం అక్రమ నిర్మాణాలను సైతం సక్రమమే అంటూ పచ్చజెండా ఊపేస్తున్నారు. స్వయంగా పర్యవేక్షిస్తూ భవనాల పనులు పూర్తి చేయించేస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కార్పొరేషన్ ఉన్నతాధికారులు మాత్రం చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇదే అదునుగా పైసల కోసం ప్లానింగ్ అధికారులు, సిబ్బంది యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు.

తిరుపతిలో జోరుగా అక్రమ నిర్మాణాలు

తిరుపతిలో జోరుగా అక్రమ నిర్మాణాలు

తిరుపతిలో జోరుగా అక్రమ నిర్మాణాలు