
బాల సదనం నిర్వహణకు దరఖాస్తులు
తిరుపతి అర్బన్ : సూళ్లూరుపేటలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు చెందిన బాలసదనం నిర్వహించేందుకు ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని ఐసీడీఎస్ పీడీ వసంత బాయి తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ నిబందనల మేరకు సదనం నిర్వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు స్వచ్ఛంధ సేవా సంస్థలు ప్రతిపాదనలు పంపాలని కోరారు. ప్రత్యేక అవసరాలు గల బాలల సంరక్షణలో అనుభవం ఉన్న స్వచ్ఛంధ సంస్థలు తమ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌తో పాటు మూడేళ్ల ఆడిట్ నివేదికలను కలెక్టరేట్‌లోని బి–బ్లాక్ రూమ్ నెంబర్ 505, 506లో ఈ నెల 24 సాయంత్రం 5 గంటల లోపు అందించాలని సూచించారు.
ఎస్వీయూ విద్యార్థికి
అరుదైన అవకాశం
తిరుపతి సిటీ : ఎస్వీయూ ఫిజిక్స్ విభాగంలో పీజీ పూర్తి చేసిన సీహెచ్ బ్రహ్మారెడ్డి అనే విద్యా ర్థికి విదేశాల్లో పరిశోధనలు చేసే అరుదైన అవకాశం లభించింది. ఇందుకోసం ప్రతి నెలా రూ.లక్ష స్కాలర్‌షిప్ సైతం అందించనున్నారు. ఈ మేరకు బ్రహ్మారెడ్డి సౌత్‌కొరియాలోని పూసన్ నేషనల్ యూనివర్సిటీలోని కెమికల్ మెటీరియల్స్ విభాగంలో పరిశోధనలు చేయనున్నారు. సోమవారం ఈ సందర్భంగా విద్యార్థిని ఎస్వీయూ వీసీ ప్రొఫెసర్ అప్పారావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ భూపతి నాయుడు, ఫిజిక్స్ హెడ్ ప్రొఫెసర్ దేవప్రసాదరాజు అభినందించారు. బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ పూసన్ వర్సిటీలో పీహెచ్‌డీ చేసేందుకు అవకాశం రావడం గర్వంగా ఉందన్నారు. ఫిజిక్స్ హెడ్ దేవప్రసాద్‌రాజు సహకారంతోనే పరిశోధనకు ఎంపికై నట్లు వెల్లడించారు. రూ.లక్ష ఉపకార వేతనంతో డివైజ్ ఫ్యాభ్రికేషన్స్‌లో ఓఎల్‌ఈడీ, ఆఫ్టో ఎలక్ట్రానిక్స్ డివైజెస్ అనే అంశపై నాలుగేళ్ల పాటు పరిశోధనలు చేయనున్నట్లు వివరించారు.
ఇంటర్ సప్లిమెంటరీ
పరీక్షలు ప్రారంభం
తిరుపతి ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష నిర్వహించారు. ప్రథమ సంవత్సర పరీక్షకు మొత్తం 7427మంది విద్యార్థులకు గాను 6,979 మంది హాజరయ్యారు. సెకండియర్ పరీక్షకు 848మందికి గాను 770 మంది హాజరైనట్లు ఆర్‌ఐఓ జీవీ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.