
అతీగతీ లేక తగ్గిన వినతులు
తిరుపతి అర్బన్ : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌పై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోంది. ఉన్నతాధికారులకు అందించిన వినతులకే అతీగతీ లేకుండా పోతోందని అర్జీదారుల నుంచి ఆవేదన వ్యక్తమవుతోంది. అందుకే కలెక్టరేట్ గ్రీవెన్స్‌కు వచ్చే అర్జీదారుల సంఖ్యల తగ్గిపోతోంది. వ్యయప్రయాసలకోర్చి వచ్చి వినతులు సమర్పిస్తే ఎలాంటి ఫలితం ఉండడం లేదనే భావన ప్రజల్లో రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు కేవలం 238 అర్జీలే వచ్చాయి. ఇది వరకు కలెక్టర్‌తోపాటు ఇతర అధికారులను కలిసి తమ సమస్యలు విన్నవించేందుకు అర్జీదారులు బారులు తీరేవారు. ఈ గ్రీవెన్స్‌లో ఆ పరిస్థితి కనిపించలేదు. కలెక్టర్‌తోపాటు జేసీ, డీఆర్‌ఓ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, ఇతర జిల్లా స్థాయి అధికారులు హాజరైనప్పటికీ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అందుబాటులో ఉన్నప్పటికీ జనం పలుచగానే కనిపించారు. ఈ క్రమంలోనే ప్రజా సమస్యల పరిష్కారంపై ఉన్నతాధికారులు చిత్తశుద్ధితో ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం కలిగేలా వినతులను సత్వరం పరిష్కరించాలని సూచిస్తున్నారు.

అతీగతీ లేక తగ్గిన వినతులు