తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 4 కంపార్ట్‌మెంట్లు నిండాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు 80,423 మంది స్వామివారిని దర్శించుకోగా 29,361 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.4 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 6 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది. సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి క్యూలో వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. కేటాయించిన సమయం కంటే ముందు వెళ్లిన భక్తులను క్యూలో అనుమతించరని స్పష్టం చేసింది.
వైఎస్సార్‌సీపీ నేత ఇంట్లో చోరీ
– 80 గ్రాముల బంగారు నగల అపహరణ
తిరుపతి రూరల్ (తిరుచానూరు) : తిరుపతి రూరల్ మండలం మల్లంగుంటలోని వైఎస్సార్‌సీపీ నేత చొక్కారెడ్డి జగదీశ్వరరెడ్డి ఇంట్లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. వివరాలు.. జగదీశ్వర్‌రెడ్డి హైదరాబాదులో నివాసముంటున్నారు. వేసవి సెలవుల నేపథ్యంతో పిల్లలను మల్లంగుంటలోని ఇంటిలో ఉంటున్న తన తల్లి నరేంద్రకుమారి వద్దకు పంపించారు. పైఅంతస్తులోని పడకగదిలో పిల్లలు పడుకోగా, కింద ఓ గదిలో నరేంద్రకుమారి నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు గుట్టుచప్పుడు కాకుండా బీరువా తెరిచి బంగారు ఆభరణాలు అపహరించారు.
సోమవారం ఉదయం నరేంద్రకుమారి నిద్రలేచి చూడగా బీరువా ముందు దుస్తులు చిందరవందరగా పడునానయి. లోపల దాచిన 80 గ్రాముల బంగారు నగలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరుపతి రూరల్ పోలీసులు, వేలిముద్రల నిపుణులు ఆ ఇంటికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అనంతరం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.