
తుడా చైర్మన్‌గా దివాకర్‌రెడ్డి
తిరుపతి తుడా: తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) చైర్మన్‌గా డాలర్స్ దివాకర్‌రెడ్డి పేరును ప్ర భుత్వం ఖరారు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 నా మినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. ఇందులో ఉమ్మడి జిల్లా పరిధిలో నలుగురికి చోటు లభించింది.
ఆశావహులకు భంగపాటు
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ సీనియర్ నాయకులు మబ్బుదేవనారాయణ రెడ్డి, శ్రీకాళహస్తి నుంచి శంకర్‌రెడ్డి, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి ఆశీస్సులతో బడి సుధాయాదవ్, నగిరి నియోజకవర్గానికి చెందిన ఓ కాంట్రాక్టర్ తుడా చైర్మన్ కోసం పోటీ పడ్డారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సైతం చివరి వరకు పైరవీలు చేశారు. అనేక మంది ఆశావహులు పోటీపడి భంగపడ్డారు. చివరికి మంత్రి లోకేష్ ఆశీస్సులతో దివాకర్ రెడ్డికే తుడా చైర్మన్‌గిరి దక్కింది. నామినేటెడ్ పదవులు ప్రకటించడంతో తిరుపతిలోని టీడీపీ ముఖ్యనేతలంతా అసంతృప్తిలో ఉన్నారు.
అసంతృప్తిలో సీనియర్లు
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నాలుగు నామినేటెడ్ పదవులను ప్రకటించారు. ఇందులో తుడా చైర్మన్ సహా మిగిలిన పోస్టుల భర్తీ పై అసంతృప్తి సెగలు వ్యక్తమవుతున్నాయి. తమకు పనికిరాని పదవులు కట్టబెట్టారని మండిపడుతున్నారు. ఈ పదవులు నాలుక మీద గీసుకునేందుకు కూడా పనికిరావని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీనియర్లకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ పార్టీ అధిష్టానం పై రగిలిపోతున్నారు.
నామినేటెడ్ పదవుల్లో పలువురికి చోటు
చిత్తూరు అర్బన్: కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు కూటమి నాయకులకు పదవులు వరించాయి. ఇందులో రాష్ట్ర విద్య, సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా కుప్పంకు చెందిన రాజశేఖర్, రాష్ట్ర గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్‌గా తిరుపతికి చెందిన సుగుణమ్మ, తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్‌గా తిరుపతికి చెందిన దివాకర్‌ను, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా తిరుపతికి చెందిన పసుపులేటి హరిప్రసాద్‌ను నియమించింది.