అరవపాళెం పాఠశాలకు మౌలిక వసతులు
చిట్టమూరు: మండలంలోని అరవపాళెం జెడ్పీ హైస్కూల్‌కు ప్రయివేటు పాఠశాలకు దీటుగా మౌలిక వసతులు కల్పిస్తామని శ్రీ సిటీ ఎండీ రవిసన్నారెడ్డి స్పష్టం చేశారు. శ్రీసిటీ ఫౌండేషన్ చొరవతో పాఠశాల ఆవరణలో జపాన్‌కు చెందిన ఇండియా మెటల్ వన్ స్టీల్ ప్లేట్ ప్రొసెసింగ్ లిమిటెడ్ కంపెనీ ఎండీ టైజో ఇవామితమ కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా రూ.29.5 లక్షలతో నిర్మించిన నూతన పాఠశాల భవనాన్ని శ్రీసిటీ ఎండీతో పాటు, టైజోఇవామితో కలసి సోమవారం ప్రారంభించారు. అలాగే పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం రవిసన్నారెడ్డి మాట్లాడుతూ తాను అరవపాళెం గ్రామంలో జన్మించి ఇదే పాఠశాలలో పదో తరగతి వరకు చదివానని గుర్తుచేసుకున్నారు. అనంతరం బీటెక్ పూర్తి చేసి అమెరికాకు వెళ్లి అక్కడ ఉన్నత విద్య అభ్యసించి తడలో శ్రీసిటీని ప్రాంభించినట్టు తెలిపారు. శ్రీసిటీలోని ఐమాస్ కంపెనీ సామాజిక సేవలో భాగంగా తాను చదువుకున్న పాఠశాలకు అదనపు భవనం కావాలని కోరగా వెంటనే ఎండీ టైజో ఇవామి స్పందించి భవన నిర్మానానికి సహకరించారన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో పది పరీక్షల్లో రాష్ట్ర స్థాయి ర్యాంక్ సాధించిన విద్యార్థికి రూ.లక్ష, జిల్లా స్థాయిలో రాణించిన విద్యార్థికి రూ.50వేలు, మండల స్థాయిలో రాణించిన వారికి రూ.10 వేలు నగదు బహుమతులు ఇస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో ఎంఓఈ బీవీ కృష్ణయ్య, హెచ్‌ఎం ప్రభావతి పాల్గొన్నారు.


