పని చేసే గ్యారేజ్‌కే కన్నం

Worker Had Stealing At His Working Garage - Sakshi

గచ్చిబౌలి: పని చేసే గ్యారేజ్‌కు కన్నం వేసిన ఓ మెకానిక్‌ భారీ చోరీకి పాల్పడి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మాదాపూర్‌ డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. అసీఫ్‌నగర్‌కు చెందిన  మహ్మద్‌ తాహెర్‌  అయ్యప్పసొసైటీలోని శ్రీ మోటార్స్‌ మల్టీబ్రాండ్‌ లగ్జరీ కారు సర్వీసింగ్‌ సెంటర్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నారు. షోరూం యజమాని గేడంపేట్‌లో మరో షోరూమ్‌ను ఏర్పాటు చేసేందుకు నగదు తీసుకువచ్చి సర్వీసింగ్‌ సెంటర్‌లోని అల్మారా పెట్టాడు. ఈ విషయాన్ని గుర్తించిన తాహెర్‌ నగదు కాజేసేందుకు తన స్నేహితులైన  సయ్యద్‌ జావెద్, సైఫ్‌ మొయినొద్ధీన్‌తో కలిసి పథకం పన్నాడు.

 తెల్లవారు జాము ముగ్గురు కలిసి  బైక్‌పై గ్యారేజ్‌కు వచ్చారు. తాహెర్‌ దూరంగా ఉండి వచ్చిపోయేవారిని గమనిస్తుండగా, సైఫ్‌ మొయినొద్ధీన్‌  సర్వీస్‌ సెంటర్‌ వెనక డోర్‌ స్క్రూలు తొలగించి లోపలికి ప్రవేశించాడు. లాకర్‌ను తెరిచి నగదు తీసుకెళ్లాడు. మర్నాడు వాచ్‌మెన్‌ బాలరాజు అల్మారా తలుపు తెలిచి ఉండటాన్ని గుర్తించి యజమానికి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు తాహెర్‌గా గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. అతడు ఇచ్చిన సమాచారంతో మిగతా నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రూ.55 లక్షల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.  

చోరీ సొత్తు మూడు భాగాలుగా.. 
చోరీ చేసిన సొమ్మును తాహెర్‌ రూ.20 లక్షలు, జావెద్‌ రూ.20 లక్షలు, సైఫ్‌ మొయినొద్ధీన్‌ రూ.15 లక్షలు పంచుకున్నారు. అయితే ఇందులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.  తనపై అనుమానం రాకుండా ఉండేందుకు  తాహెర్‌ యథావిధిగా సర్వీసింగ్‌ సెంటర్‌కు వస్తున్నాడు. దాదాపు 45 మందిని విచారించిన పోలీసులు చివరికి తాహెర్‌ను నిందితుడిగా గుర్తించారు. సమావేశంలో మాదాపూర్‌ ఏసీపీ రఘునందన్‌ రావు, సీఐ రాజేంద్ర ప్రసాద్, ఎస్‌ఓటీ సీఐ శివ ప్రసాద్, ఎస్‌ఐ విజయ వర్ధన్‌ పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top