మా కూతురికే.. ప్రపంచ సుందరి కిరీటం!

VLCC Femina Miss India Manasa Varanasi Full Interview In telugu - Sakshi

అనుకున్నది చేసేయడమే ఆమె లక్ష్యం

సరదాగా పాల్గొని మిస్‌ తెలంగాణ పోటీల్లో పాల్గొంది

ఇప్పుడు ‘మిస్‌ ఇండియా’ అవడం ఆనందంగా ఉంది

మిస్‌ ఇండియా మానస వారణాసి తల్లిదండ్రులతో ‘సాక్షి’ చిట్‌ఛాట్‌

ఆమె మిస్‌ ఇండియా అయినా నాకు ముద్దుల మనవరాలే. నా వయసు 80 ఏళ్లు. మానస వారణాసి అంటే మాటల్లో వర్ణించలేనంత ఆప్యాయత, అనురాగం. ఏం అమ్మాయి.. పెళ్లీడుకొచ్చావు. నీకు ఈ కాలేజీలు, స్టేజ్‌ షోలు ఎందుకు? మంచి సంబంధం చూసి వివాహం చేస్తామని వెంటపడేదాన్ని. ఈ విషయంలో మా ఇద్దరి మధ్య ప్రతిరోజూ సరదా కబుర్లు సాగుతుండేవి. ఓ వైపు మనవరాలు మానసను చీవాట్లు పెడుతూనే మరోవైపు ఆమె అమితంగా ఇష్టపడే పెసరట్టు, పులిహోర, ఫ్రైడ్‌రైస్, వైట్‌రైస్‌ వండిపెట్టేదాన్ని. మానస మిస్‌ ఇండియా కిరీటాన్ని గెలిచిన తరుణంలో నా ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. వెంటనే ఆమెకు వీడియో కాల్‌ చేసి విష్‌ చేశాను.
– గరికపాటి అన్నపూర్ణ, మిస్‌ ఇండియా మానస వారణాసి అమ్మమ్మ

చిన్నప్పుడు భరతనాట్యంలో ప్రావీణ్యం..స్విమ్మింగ్‌లో ప్రతిభ.. స్కూల్, కాలేజీలో యాంకరింగ్‌..ఇలా డ్యాన్సర్‌గా, స్విమ్మర్‌గా, సింగర్‌గా, ఆర్టిస్ట్‌గా, బుక్‌ రీడర్‌గా నా కూతురు ఎప్పుడూ ముందుండేది. తను ఏదైనా అనుకుంటే ఆ పని చేసే వరకు నిద్రపోయేది కాదు. మలేషియాలో చదివినప్పటికీ..మనదేశ సంస్కృతి, సంప్రదాయాలను ఫాలో అవుతూ..నేడు మిస్‌ ఇండియాగా నిలవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు మిస్‌ ఇండియా మానస వారణాసి తల్లిదండ్రులు శైలజ, రవిశంకర్‌.  వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో మిస్‌ ఇండియా కిరీటాన్ని సాధించి నగరానికి వస్తున్న సందర్భంగా ‘సాక్షి’ ఆమె కుటుంబ సభ్యులను పలకరించింది. కృష్ణాజిల్లా తిరువూరుకు చెందిన శైలజ, రవిశంకర్‌ దంపతులు 1992లో నగరంలో స్థిరపడ్డారు. ఆ తర్వాత రవిశంకర్‌ మలేషియాలో ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌గా చేసేవారు. అదే సమయంలో కూతురు స్కూల్‌ విద్య అంతా మలేషియాలో జరిగింది. 11,12 తరగతులు ఫిడ్జ్‌లో చదివింది. ఇంజనీరింగ్‌ ఇబ్రహింపట్నంలోని వాసవి ఇంజనీరింగ్‌ కాలేజీలో చదివింది. మరిన్ని విశేషాలు వారి మాటల్లో...

తనే స్టైలిస్ట్‌..తనే డిజైనర్‌ 
వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా  పోటీలు చాలా వరకు వర్చువల్‌ వేదికగా జరిగాయి. ఉదయం 5.30 గంటలకే మానస నిద్రలేచేది. ఉదయం లేచి ఆరోజంతా ఏం చేయాలనే అంశాలపై డైరీ రాసుకునేది. వర్చువల్‌గా పోటీలు మొదలయ్యే వరకు తనే డ్రస్‌ డిజైన్‌ చేసుకునేది.  సొంతంగా మేకప్‌ వేసుకునేది. ఇంట్లో ఒక్కరి సాయం కూడా అడిగేది కాదు. ఇలా ఈ పోటీల్లో తనే ఒక స్టైలిస్ట్‌గా, హెయిర్‌ డిజైనర్‌గా, ఫ్యాషన్‌ డిజైనర్‌గా ఉన్న పట్టుదల మాకెంతో నచ్చింది.

ముషీరాబాద్, కోఠీలోని పిల్లలకు విద్యాభ్యాసం 
వీలు కుదిరినప్పుడల్లా ముషీరాబాద్‌ గర్ల్స్‌ స్కూల్, కోఠిలోని షెల్టర్‌హోంలో ఉన్న పిల్లలకు ఉదయం వెళ్లి మ్యాథ్స్‌ ఇంగ్లిష్‌ నేర్పించేది. నేనే స్వయాన తనని బైక్‌ మీద డ్రాప్‌ చేసి వచ్చేదాన్ని తల్లి శైలజ వివరించారు. ఇలా ఓ ఎన్జీఓలో మూడేళ్ల పాటు ఫ్రీగా పిల్లలకు సర్వీస్‌ చేసింది. ఇంట్లో తన పని తను చేసుకుంటూ ఉంటుంది. తన చెల్లి, ఫ్రెండ్స్‌తో కలసి సరదాగా గడుపుతుంటుంది. డిసెంబర్‌లో జరిగే ప్రపంచ పోటీల్లో నా కూతురు ప్రపంచ కిరీటం గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు తల్లి శైలజ.


ఖాళీ దొరికితే నవలలు చదివేది
చిన్నప్పటి నుంచి బుక్స్‌ చదవడం అంటే మానసకు చాలా ఇష్టం. ఖాళీ దొరికితే బుక్స్‌ చదివేది. అలా కాలేజీ డేస్‌ నుంచి సెలవుల సమయంలో నవలలు చదివేది. వద్దన్నా వినేది కాదు.  ఖాళీ టైంలో అక్కతో కలసి యూట్యూబ్‌లో వంటలు చూస్తూ చేసి అమ్మనాన్నలకు వండిపెట్టేవాళ్లమని వివరించింది మానస చెల్లి మేఘన. ఇలా చైనీస్, థాయ్‌లాండ్‌ వంటకాలన్నీ ఇష్టపడేది మానస. 

అక్క, నేను గ్రీటింగ్‌ కార్డ్స్‌ ఇచ్చుకునేవాళ్లం 
ఇద్దరం చిన్న చిన్న విషయాల్లో గొడవ పడేవాళ్లం. అయినా.. అక్కంటే నా­కు, నేనంటే అక్కకి ప్రాణం. ఇద్దరం ఫేస్టి­వల్స్‌ అప్పుడు గ్రీటింగ్‌ కార్డ్స్‌ ఇచ్చుకునేవాళ్లం. ది బెస్ట్‌ సిస్టర్‌ ఫర్‌ ఎవర్‌ అంటూ నేను మంచి మెసేజెస్‌ పంపితే తను ఫిదా అయ్యేది.    
– మేఘన వారణాసి (మానస సోదరి) 

ఏమున్నా మాతోనే షేర్‌ చేసుకుంటుంది
మానస ఏమున్నా మాతోనే షేర్‌ చేసుకునేది. కలసి మూవీస్‌కి వెళ్తుంటాం. ఎక్కువగా తనకి ఇంగ్లీష్‌ సినిమాలంటే ఇష్టం. అందాల పోటీలకోసం మా ఫ్రెండ్‌ పడిన కష్టం మాకు బాగా తెలుసు. ఇప్పుడు మిస్‌ ఇండియా టైటిల్‌ గెలవడం చాలా ఆనందంగా ఉంది.
– నిహారిక, మనస్విని, (మానస ఫ్రెండ్స్‌)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top