
హైదరాబాద్: నగరంలో విద్యుత్ స్తంబాలకు వేలాడదీసి కేబుల్ వైర్లు తొలగింపు అంశానికి సంబంధించి భారతీ ఎయిర్‌టెల్ పిటిషన్‌పై ఈరోజు(శుక్రవారం, ఆగస్టు 22వ తేదీ) విచారణ జరిగింది. దీనిలో భాగంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ బీమాపాక కీలక ఆదేశాలు జారీ చేశారు. లైసెన్స్ తీసుకున్న కేబుల్ తప్ప మిగతా ఏవీ ఉండకూడదని ఆదేశించారు. దీనిలో భాగంగా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు రామాంతాపూర్‌లో విద్యుత్ షాక్ కారణంగా పలువురు మరణించిన ఘటనను జడ్జి నగేష్ ప్రస్తావించారు. బర్త్డే రోజే తండ్రికి తలకొరివి పెట్టిన బాలుడి ఉదంతాన్ని ఇక్కడ ఉదహరిస్తూ ఉద్వేగభరిత వ్యాఖ్యలు చేశారు. కేకు కోయాల్సిన తొమ్మిదేళ్ల బాలుడు.. తలకొరివి పెట్టడం కలిచి వేసిందన్నారు. విద్యుత్ ప్రమాదంపై ఎవరి వారు చేతులు దులుపుకుంటే ఎలా అని, ప్రజల ప్రాణాలకు బాధ్యులు ఎవరని ఆయన ప్రశ్నించారు.
‘ఆ ఘటనతో ప్రతి హృదయం పగిలిపోయింది.. దీనికి అందరం బాధ్యులేమేనా?, ఈ ఘటనతో సమాజం సిగ్గుతో తలదించుకోవాలి’ అని జస్టిస్‌నగేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. రామంతాపూర్‌లో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లోభాగంగా ఊరేగింపు రథానికి కరెంట్ తీగలు తగిలి ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. తొలుత ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, ఆపై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు.
రామంతాపూర్‌లో అధికారుల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. దీంతో విద్యుత్ స్తంభాలపై కేబుల్ వైర్లు కట్ చేసే పనిని ప్రభుత్వం చేపట్టింది. అయితే ఈ అంశానికి సంబంధించి భారతీ ఎయిర్‌టెల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసు సోమవారానికి వాయిదా పడింది.