TS Housing Dept: కథ కంచికి.. తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

TS Govt decides to wind up Housing dept merge with T, R and B Dept - Sakshi

రోడ్లు–భవనాల శాఖలో గృహ నిర్మాణశాఖను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు

హౌసింగ్‌ బోర్డు, కార్పొరేషన్, స్వగృహ, డీఐఎల్‌ అన్నీ ఆ శాఖ పరిధిలోకి..

రాష్ట్రంలో లక్షల మంది పేదలకు ఇళ్లు నిర్మించిన గృహ నిర్మాణశాఖ, 

అనుబంధ విభాగాలు... తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితిలో మార్పు

హౌసింగ్‌ బోర్డు కింద జరగని నిర్మాణాలు.. స్వగృహ ఆస్తులన్నీ వేలం

నామమాత్రంగా మారిపోయిన హౌసింగ్‌ కార్పొరేషన్‌

డబుల్‌ బెడ్రూం పథకం నిర్వహణ కలెక్టర్ల చేతిలోనే..

పోలీసులు, వైద్యారోగ్య సిబ్బంది ఇళ్లు నిర్మించే సంస్థలూ 

త్వరలో ఆర్‌ అండ్‌ బీ పరిధిలోకి!

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నో దశాబ్దాల పాటు ‘పేదింటి’కి పెన్నిధిగా నిలిచిన గృహనిర్మాణ శాఖ కథ కంచికి చేరింది. వేల కుటుంబాలకు నీడను కల్పించిన ఆ శాఖ ఇప్పుడు రోడ్లు–భవనాల శాఖలో విలీనమైంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విలీనానికి సంబంధించి కొన్నిరోజుల కింద జరిగిన కేబినెట్‌ భేటీలోనే తీర్మానించినా శుక్రవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. గృహనిర్మాణ శాఖలో అంతర్భాగమైన హౌసింగ్‌ కార్పొరేషన్‌ (గృహనిర్మాణ సంస్థ), హౌసింగ్‌ బోర్డు (గృహ నిర్మాణ మండలి), రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్‌బోర్డుకు అనుబంధంగా ఏర్పాటైన డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (డీఐఎల్‌) తదితర విభాగాలన్నీ రోడ్లు–భవనాల శాఖ పరిధిలోకి వెళ్లిపోయాయి. 

రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచే.. 
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హౌసింగ్‌ బోర్డు, రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్లకు పనిలేకుండా పోయింది. పేదల ఇళ్లకు సంబంధించి డబుల్‌ బెడ్రూం పథకాన్ని తొలుత హౌసింగ్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షించినా.. దాని ఆధ్వర్యంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. సీఎం కేసీఆర్‌ దీనిపై ఏసీబీతో విచారణకు ఆదేశించి, ఆ శాఖలోని ఉద్యోగులను ఇతర కార్పొరేషన్లు, శాఖల పరిధిలోకి మార్చారు. దీంతో హౌసింగ్‌ కార్పొరేషన్‌ నామమాత్రంగా మారింది. డబుల్‌ బెడ్రూం ఇళ్ల పథకం అమలును జిల్లా కలెక్టర్లకు అప్పగించటంతో.. రుణాలు తీసుకోవడానికే ఇది పరిమితమైంది. ఒకప్పుడు వందలాది ఉద్యోగులతో కళకళలాడిన ఈ సంస్థలో ప్రస్తుతం 50 మందే ఉన్నారు. వీరికీ లెక్కలు క్రోడీకరించడం మినహా పనిలేకుండా పోయింది. ఇప్పుడు వీరు ఆర్‌ అండ్‌ బీ పరిధిలోకి వెళ్తున్నారు. 

హౌసింగ్‌ బోర్డు, ‘స్వగృహ’ కథ కంచికే! 
అల్పాదాయ, మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలకు ఇళ్లు నిర్మించి ఇచి్చన హౌసింగ్‌ బోర్డు.. పేదలకు చవకగా ఇళ్లు కట్టించేందుకు 2007లో ప్రారంభమైన రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ల పరిస్థితీ ఇంతే. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గృహ నిర్మాణ కార్యకలాపాలు చేపట్టకపోవడంతో వీటికి ఎలాంటి పని లేకుండా పోయింది. అప్పట్లోనే కట్టి అసంపూర్తిగా మిగిలిన వాటిని ఉన్నవి ఉన్నట్టుగా అమ్ముకోవటానికే స్వగృహ కార్పొరేషన్‌ పరిమితమైంది. ఇక ఈ రెండు విభాగాల కథ కంచికి చేరినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేదల గృహ నిర్మాణం అన్నది ఎన్నికల ప్రధాన హామీల్లో ఒకటి కావడంతో హౌజింగ్‌ కార్పొరేషన్‌ మాత్రం కొనసాగే వీలుందని అంటున్నారు. ఇక పోలీసు సిబ్బందికి ఇళ్లు నిర్మించే పోలీసు హౌసింగ్‌ కార్పొరేషన్, వైద్యారోగ్య సిబ్బందికి ఇళ్లు నిర్మించి ఇచ్చే సంస్థలను కూడా ఆర్‌అండ్‌బీ శాఖ పరిధిలోకి తీసుకురానున్నట్టు సమాచారం. 

పూర్తికాని ఆస్తుల పంపకం 
రాష్ట్రం విడిపోయాక హౌసింగ్‌బోర్డు ఆస్తుల పంపకం వివాదంగా మారింది. దీనిని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం 9వ షెడ్యూల్‌లో చేర్చారు. రాజీవ్‌ స్వగృహ ఆస్తులను మాత్రం ఎక్కడివి అక్కడే పద్ధతిలో రెండు రాష్ట్రాల మధ్య పంచారు. దాని అప్పులను కూడా పంచగా.. తెలంగాణకు రూ.900 కోట్ల  రుణాలు వచ్చాయి. ప్రస్తుతం సర్కారు స్వగృహ ఆస్తులను క్రమంగా వేలం వేస్తోంది. 

మూసీ వరదలతో తెరపైకి ‘హౌజింగ్‌ బోర్డు’! 
గృహనిర్మాణ శాఖలో ప్రధాన విభాగంగా ఉన్న హౌసింగ్‌ కార్పొరేషన్‌ కంటే కొన్ని దశాబ్దాల ముందే హౌసింగ్‌ బోర్డుకు బీజం పడింది. 1908లో మూసీ వరదలతో దెబ్బతిన్న హైదరాబాద్‌ నగరాన్ని పునరుద్ధరించటంతోపాటు విశాలమైన రహదారుల నిర్మాణం, మెరుగైన పారిశుధ్య వ్యవస్థ ఏర్పాటు, వరదలతో నిరాశ్రయులైన వారికి ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ఏడో నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌.. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ‘సిటీ ఇంప్రూవ్‌మెంట్‌ బోర్డు’ను ప్రారంభించారు. మూసీ వరదలతో దెబ్బతిన్న నగరాన్ని ఆ బోర్డు ఆధ్వర్యంలోనే పునరుద్ధరించారు. వేల సంఖ్యలో ఇళ్లను నిర్మించి ఇచ్చారు. తర్వాత సికింద్రాబాద్‌ ప్రాంతంలో మౌలిక వసతులు మెరుగుపర్చేందుకు 1931లో ‘టౌన్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ట్రస్టు’ను ఏర్పాటు చేశారు. 1956లో ఈ రెండింటినీ విలీనం చేస్తూ గృహనిర్మాణ మండలి (హౌజింగ్‌ బోర్డు)ను ఏర్పాటు చేశారు. 

ఆసియాలోనే అతిపెద్ద హౌజింగ్‌ కాలనీ 
కూకట్‌పల్లి హౌజింగ్‌ బోర్డు (కేపీహెచ్‌బీ) కాలనీ.. ఒకప్పుడు ఆసియాలోనే మారుమోగిన పేరు. ఇక్కడ ఏడు ఫేజ్‌లలో అల్పాదాయ, మధ్య ఆదాయ, ఎగువ మధ్య ఆదాయ వర్గాలకు ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ పేర్లతో హౌజింగ్‌ బోర్డు దాదాపు 9 వేల ఇళ్లను నిర్మించింది. అప్పట్లో ఆసియాలోనే ఇది అతిపెద్ద హౌజింగ్‌ కాలనీ. అంతకుముందు హైదరాబాద్‌లో తొలి హౌసింగ్‌ బోర్డు కాలనీగా విజయనగర్‌ కాలనీని నిర్మించారు. తర్వాత మౌలాలి, ఎస్సార్‌ నగర్, వెంగళరావునగర్‌ కాలనీలను కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రధాన పట్టాణాల్లోనూ కాలనీలు నిర్మించారు. ప్రభుత్వం నుంచి నిధులు లేకుండా సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ పద్ధతిలో ఇది కొనసాగింది. అయితే 1980 దశకం చివరికి వచ్చేసరికి ప్రైవేటు బిల్డర్ల హవా మొదలై.. హౌజింగ్‌ బోర్డు ప్రాభవం తగ్గుతూ వచి్చంది. అడపాదడపా కొన్ని కాలనీల్లో ఇళ్ల నిర్మాణం చేపట్టినా సింగపూర్‌ టౌన్‌షిప్, మలేíÙయా టౌన్‌షిప్‌లు మినహా పెద్దగా గుర్తుండిపోయే ప్రాజెక్టులు లేవు. చివరిగా ఉమ్మడి రాష్ట్రంలో ఔటర్‌ రింగ్‌రోడ్డు సమీపంలోని రావిర్యాలలో ఇళ్లను నిర్మించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏ ప్రాజెక్టూ చేపట్టలేదు. మొత్తంగా తెలంగాణ పరిధిలో 20వేలకుపైగా ఇళ్లను బోర్డు స్వయంగా నిర్మించింది. 

వేల ఎకరాల ల్యాండ్‌ బ్యాంక్‌తో.. 
చెన్నారెడ్డి సీఎంగా ఉండగా హౌజింగ్‌ బోర్డుకు చైర్మన్‌గా వ్యవహరించిన ధర్మారెడ్డి దీనికి భారీగా ల్యాండ్‌ బ్యాంకు సిద్ధం చేశారు. కూకట్‌పల్లి నుంచి మాదాపూర్‌ వరకు ఏకంగా 6 వేల ఎకరాల భూమిని సమీకరించారు. తర్వాత ప్రైవేటు సంస్థలతో కలిసి ప్రాజెక్టులు చేపట్టేందుకు ప్రత్యేకంగా డెక్కన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (డీఐఎల్‌)ను ప్రారంభించి... కొన్ని వేల ఎకరాలను దానికి బదలాయించారు. కానీ కొన్ని బడా సంస్థలు వందల ఎకరాల భూమిని తీసుకుని బోర్డుకు పూర్తి డబ్బులు చెల్లించకుండా ఎగ్గొట్టి నష్టపర్చాయి. ఇప్పటికీ ఆ వివాదాలు కొనసాగుతున్నాయి. జేఎన్టీయూ సమీపంలో హౌజింగ్‌ బోర్డు ఉద్యోగులకు 1978లో కాలనీని నిర్మించారు. దానికి ధర్మారెడ్డి పేరే పెట్టుకున్నారు. అప్పట్లో ఉద్యోగులకు రూ.5.80కు గజం చొప్పున స్థలాన్ని కేటాయించటం గమనార్హం. 

పీజేఆర్‌ టు కేసీఆర్‌.. 
పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చే పథకం తొలుత సంక్షేమశాఖ అ«దీనంలో ఉండేది. 1990లలో కార్మిక శాఖ మంత్రిగా ఉన్న పి.జనార్దన్‌రెడ్డి ప్రత్యేకంగా గృహనిర్మాణ శాఖను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. నాటి ముఖ్యమంత్రి నేదురుమల్లి అంగీకరించడంతో ప్రత్యేక శాఖగా ఏర్పాటైంది. నాటి నుంచి వివిధ విభాగాలు, కార్పొరేషన్లతో విస్తరించి.. పేదలు, మధ్యతరగతి ఇళ్లు కట్టించిన గృహనిర్మాణ శాఖ ఇప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వంలో కాలగర్భంలోకి వెళ్లిపోయింది. 

వైఎస్సార్‌ హయాంలో చరిత్ర సృష్టించి.. 
పేదల కోసం నిరంతరం తపించిన వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదల గృహ నిర్మాణ పథకానికి కొత్త నిర్వచనం చెప్పారు. పాదయాత్ర సమయంలో జనం బాధలను ప్రత్యక్షంగా చూసిన ఆయన.. ప్రతి పేద కుటుంబానికి సొంతింటిని అందించాలన్న లక్ష్యంతో ఇందిరమ్మ పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతంలోనే ఏకంగా 18 లక్షల ఇళ్లను మంజూరు చేశారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. దానిని చాలా రాష్ట్రాలు అనుసరించాయి. వైఎస్సార్‌ కన్నుమూసిన తర్వాత ఆ పథకం క్రమంగా నీరుగారుతూ వచ్చింది.  

దివిసీమ ఉప్పెన నిరాశ్రయులకు ఇళ్ల నిర్మాణంతో మొదలు..
1977లో కృష్ణా–గుంటూరు ప్రాంతాలను కుదిపేసిన దివిసీమ ఉప్పెనలో నిరాశ్రయులైన పేదలకు గూడు కల్పించేందుకు నాటి చెన్నారెడ్డి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమమే.. క్రమంగా గృహనిర్మాణ సంస్థ ఆవిర్భావానికి దారితీసింది. 1979లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం గృహనిర్మాణ పథకాన్ని చేపట్టి.. ప్రత్యేకంగా దివిసీమలో ఇళ్ల నిర్మాణం చేపట్టింది. తర్వాత ముఖ్యమంత్రి అయిన ఎన్‌టీ రామారావు.. ఈ కార్యక్రమాన్ని మొత్తంగా ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పేదలకు ఇళ్లు కట్టించే పథకంగా మార్చారు. ఏటా లక్షన్నర చొప్పున ఇళ్లు నిర్మించేలా పంచవర్ష ప్రణాళికను చేపట్టారు. 

మరిన్ని వార్తలు :

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top