
రోడ్డు లేని తండాలోకి వెళ్లలేక 2 కి.మీ. దూరంలోనే ఆగిన ‘108’అంబులెన్స్
భార్యను మోసుకుంటూ వర్షంలోనే బయలుదేరిన భర్త
మార్గమధ్యంలోనే ప్రసవం.. సంగారెడ్డి జిల్లాలో ఘటన
ఓట్లు తప్ప తమ బాగోగులు పట్టవా అంటూ నేతలపై గిరిజనుల ఆగ్రహం
నారాయణఖేడ్: ఓవైపు వర్షం.. మరోవైపు నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. సకాలంలో 108 అంబులెన్స్ వచ్చినా గర్భిణి చెంతకు చేరే రోడ్డుమార్గం లేక 2 కి.మీ. దూరంలోనే నిలిచిపోయిన పరిస్థితి. దీంతో భర్త తన భార్యను మోసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ఆమెకు పురిటినొప్పులు ఎక్కువై చెట్టు కింద ప్రసవించింది. సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం మున్యానాయక్ తండాలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
శాంతినగర్ తండా పంచాయతీ పరిధిలోని మున్యానాయక్ తండాకు చెందిన కౌసల్యాబాయి (26)కి నెలలు నిండటంతో పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె కుటుంబ సభ్యులు 108కి ఫోన్‌లో సమాచారం ఇవ్వగా అంబులెన్స్ 2 కి.మీ. దూరంలోని గురుసింగ్ తండా వరకు వచ్చి ఆగిపోయింది.
ముందుకు వెళ్లేందుకు రోడ్డు లేకపోవడంతో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (ఈఎంటీ) సంగ్‌శెట్టి, అంబులెన్స్ డ్రైవర్ కాలినడకన గర్భిణి కోసం ఎదురు వెళ్లారు. అప్పటికే తండా నుంచి భర్త వాసుదేవ్, ఇతర కుటుంబ సభ్యులు కౌసల్యాబాయిని మోసుకొస్తుండగా నొప్పులు అధికమై మార్గమధ్యలో చెట్టుకింద ప్రసవించి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కౌసల్యాబాయికి ఇది మూడవ కాన్పు.
ఇప్పటికే కూతురు, కుమారుడు ఉన్నారు. బాలింతను అంబులెన్స్ ఆగిన గురుసింగ్ తండా వరకు ఈఎంటీ సంగ్‌శెట్టి మోసుకొచ్చాడు. అనంతరం అంబులెన్స్‌లో కరస్‌గుత్తి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారు.
గర్భిణిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తమ తండాకు రోడ్డు సౌకర్యం లేకపోవడంపై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో విన్నవించినా పట్టించుకోలేదన్నారు. రాజకీయ నాయకులు ఓట్ల కోసం వస్తున్నారు తప్ప తమ బాగోగులు చూడటం లేదని గిరిజన మహిళలు మండిపడ్డారు.