బెల్ట్‌ షాపులుంటే బట్టలూడదీసి బొక్కలో వేయిస్తా.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

TPCC Revanth Reddy Fire On BRS Leaders - Sakshi

రాష్ట్రంలో 3 వేల వైన్‌ షాపులు, 60 వేల బెల్ట్‌ షాపులు కేసీఆర్‌ తీసుకొచ్చారు. అందుకే అక్కల బాధలను అర్థం చేసుకొని కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే గ్రామాల్లో బెల్ట్‌ షాపులుంటే బట్టలూడదీసి కొట్టి బొక్కలో వేయిస్తా’అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు కాంగ్రెస్‌ రైతు బజార్‌లను తెరిపిస్తే.. ఈనాడు బెల్ట్‌ షాపులు తెరిచారని, వీటిని కాంగ్రెస్‌ రాగానే రద్దు చేస్తుందని ప్రకటించారు. హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో భాగంగా వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో మంగళవారం రాత్రి జరిగిన స్ట్రీట్‌ కార్నర్‌ మీటింగ్‌లో రేవంత్‌రెడ్డి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

తెలంగాణ తెచ్చామని చెప్పిన బీఆర్‌ఎస్‌ పార్టీకి  రెండుసార్లు అవకాశం ఇచ్చారని.. అదే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక అవకాశం ఇచ్చి చూడాలని విజ్ఞప్తి చేశారు. ‘10 ఎకరాల్లో పంజాగుట్ట చౌరస్తాలో గడీ నిర్మించుకున్నాడు. సచివాలయం, ప్రగతి భవన్‌లో విలాసవంత జీవనం ఉంది. గజ్వేల్‌లో సీఎం కేసీఆర్‌ వెయ్యి ఎకరాల్లో ఫామ్‌హౌస్, కొడుకు కేటీఆర్‌ 500 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారు. కానీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు’అని ఆయన మండిపడ్డారు. 

కొండా మీద కోపంతో వరంగల్‌ను చెత్త కుప్పలా తయారు చేశారు
’’దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన వరంగల్‌కు 2014లో గ్రహణం పట్టింది. ప్రజలపై ఆధిపత్యం చెలాయించే ప్రతీ సందర్భంలోనూ కాకతీయ యూనివర్సిటీ బిడ్డలు స్పందించారు. కానీ ఈ వర్సిటీలో నియామకాలు లేవు. బోధనా సిబ్బంది లేరు. ఉన్నవాళ్లకు జీతాలు లేవు. విద్యార్థులకు వసతుల్లేవు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు. మొన్న సునీల్‌నాయక్‌ పీజీ చదివి ఆత్మహత్య చేసుకున్నాడు. కొడంగల్‌లో నామీద కోపం ఉండి అభివృద్ధి చేయలేదు. కొండా దంపతుల మీద కోపం ఉండి వరంగల్‌ను చెత్త కుప్పలా తయారు చేసింది ఈ దండుపాళ్యం ముఠా’’అని రేవంత్‌ విమర్శించారు.

వరంగల్‌లో బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు గంజాయి అలవాటు చేశారు. ఇక్కడి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో సహా వరంగల్‌ ఎమ్మెల్యేలు అంతా కబ్జాలకు పాల్పడుతున్నారు అని ఆయన ఆరోపించారు. ’’దాడులే ప్రాతిపదికగా రాజకీయం చేద్దామంటే కేసీఆర్‌.. తేదీ, స్థలం ప్రకటించండి. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ అయినా, వరంగల్‌ హంటర్‌ రోడ్డు అయినా ఎక్కడైనా సిద్ధం’’అని రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు. సమావేశంలో మాజీ మంత్రి కొండా సురేఖ, ములుగు ఎమ్మెల్యే సీతక్క, వరంగల్‌ ఇన్‌చార్జ్‌ అంజన్‌కుమార్‌ యాదవ్, కొండా మురళి, సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య, వేం నరేందర్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top