Telangana: ఇవేం రోడ్లు.. వాహనదారుల బెంబేలు

Telangana: Severely Damaged Roads In The State - Sakshi

రాష్ట్రంలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారులు

అనేకచోట్ల జాతీయరహదారులు సైతం ఛిద్రం

ఆర్‌అండ్‌బీకి బదిలీ అయినగ్రామీణ రోడ్ల రూపురేఖలు మాయం 

వాహనదారుల ఒళ్లు హూనం..నిత్యం అనేక ప్రమాదాలు

తారు భారంతో మరమ్మతుకు నోచని జాతీయ రహదారులు

రాష్ట్ర రహదారులను పీడిస్తున్న నిధుల సమస్య 

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, పంచాయితీరాజ్‌ శాఖ నుంచి రోడ్లు భవనాల శాఖకు బదిలీ అయిన గ్రామీణ రోడ్లు.. ఇలా ఆ రోడ్డు, ఈ రోడ్డు అని లేదు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రోడ్లూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నాయి. రోడ్డు ప్రయాణం అంటేనే వెనుకంజ వేసే పరిస్థితి నెలకొంది. ధైర్యం చేసి కొద్దిగా దూరంగా వెళితే చాలు ఒళ్లు హూనమవుతోంది. ఎప్పట్నుంచో మరమ్మతులకు నోచక గుంతలు పడిన రోడ్లు ఇటీవలి భారీ వర్షాలకు మరింత దారుణంగా తయారయ్యాయి.

ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపించడంతో పాటు ప్రమాదాలకు కారణమవుతూ ప్రాణాలు తీస్తున్నాయి. జాతీయ రహదారుల మరమ్మతుకు చాలాచోట్ల సాంకేతిక అంశాలు అడ్డుగా మారుతుండగా, రాష్ట్ర రహదారులను పూర్తిస్థాయిలో మరమ్మతు చేసేందుకు నిధుల లేమి ఆటంకంగా మారింది. రోడ్లు భవనాల శాఖలోకి బదిలీ అయిన గ్రామీణ రోడ్లపై.. అప్పట్నుంచీ ఒక్క కంకర రాయి కూడా పడలేదంటే అతిశయోక్తి కాదు. 

హైవేపై స్పీడుకు తారు ధరలతో బ్రేకు
జాతీయ రహదారులంటే.. వాహనం రయ్యిన దూసుకెళ్లేలా, ఎలాంటి కుదుపులకు తావివ్వని విధంగా నున్నగా, విశాలంగా ఉండాలి. ఆ మేరకు తీర్చిదిద్దేందుకే సాధారణ రోడ్లను జాతీయ రహదారుల పరిధిలోకి తెస్తారు. వాటి నిర్వహణ భారమంతా కేంద్ర ప్రభుత్వానిదే. కానీ ఇప్పుడు వాటిని ఓ విచిత్ర సమస్య వెంటాడుతోంది. కోవిడ్‌ సమస్య ఉత్పన్నం కాకముందు తారు ధర మెట్రిక్‌ టన్నుకు రూ.27 వేలుగా ఉండేది. గత ఏడాదిన్నర కాలంలో దాని ధర ఏకంగా రూ.40 వేలకు చేరింది. దీంతో జాతీయ రహదారుల రెన్యూవల్‌ వర్క్స్‌ (పూర్తిస్థాయి మరమ్మతులు)కు పిలిచే టెండర్లలో కాంట్రాక్టర్లు ఎక్కువ ధరను కోట్‌ చేస్తున్నారు.

సాధారణంగా 5 శాతం ఎక్సెస్‌ వరకు అనుమతి ఉంటుంది. కానీ తారు ధర భారీగా పెరగటంతో కాంట్రాక్టర్లు 25 శాతం వరకు ధర పెంచి కోట్‌ చేస్తున్నారు. ఇది నిబంధనలకు లోబడి లేని విషయం కావటంతో అధికారులు టెండర్లను రద్దు చేస్తున్నారు. కొన్ని చోట్ల టెండర్లు ఓకే అయినా.. తారు ధర అదుపులోకి వచ్చాక రెన్యూవల్‌ వర్క్స్‌ చేపట్టొచ్చని కాంట్రాక్టర్లు చిన్నపాటి గుంతలను సరిచేసేందుకే పరిమితమవుతున్నారు. 

రాష్ట్ర రహదారుల్లో 20 వేల కి.మీ. తిప్పలే
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు, జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి రెండు వరుసల రోడ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా నిర్మించిన దాదాపు 8 వేల కి.మీ. రోడ్లు మాత్రం బాగున్నాయి. ఇవి పోను రాష్ట్రంలో మిగిలిన 20 వేల కి.మీ మేర విస్తరించి ఉన్న రాష్ట్ర రహదారులు మాత్రం క్రమంగా దారుణంగా మారుతున్నాయి. ఇందులో ఏడు వేల కి.మీ మేర ఉన్న పాత పంచా యతీరాజ్‌ శాఖలోని గ్రామీణ రోడ్లు దాదాపు ధ్వంసమయ్యాయి.

ఈ రోడ్లను ఉన్నతీకరించేందుకు గత ఏడేళ్ల కాలంలో కొన్నికొన్ని చొప్పున రోడ్లు భవనాల శాఖకు బదిలీ చేశారు. ఈ శాఖ ఆధీనంలోని 21 వేల కి.మీ. రోడ్లను నిర్వహించేందుకే నిధులు సరిపోని పరిస్థితిలో, కొత్తగా వచ్చిచేరిన ఈ రోడ్లను నిర్వహించటం దానివల్ల కావటం లేదు. దీంతో ఈ ఏడేళ్లలో ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు. ఆ రోడ్లను బలవంతంగా తమకు అప్పగించారన్న అభిప్రాయంతో ఆ శాఖ ఉంది. 


వరంగల్‌ శివారు హసన్‌పర్తి మండలం జయగిరి గ్రామం నుంచి ఎల్కతుర్తి మధ్య రోడ్డు. దీని పరిస్థితి కూడా దారుణంగా మారింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్డు నామరూపాల్లేకుండా చెదిరిపోయి పెద్దపెద్ద గోతులేర్పడ్డాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. అయినప్పటికీ ఆరోడ్డు మరమ్మతులకు నోచుకోవడం లేదు.

ఉత్తర తెలంగాణలో కొంత మేర ఓకే 
ఇక గత ఏడాది నుంచి వానలు, ఇతర కారణాలతో దెబ్బతిన్న రోడ్లకు సంబంధించి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రోడ్ల మరమ్మతుకు డిస్ట్రిక్ట్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ నుంచి ప్రభుత్వం రూ.300 కోట్లు (బొగ్గు తవ్వకాల ప్రభావం ఉన్న జిల్లాలకు) కేటాయించింది. వాటితో కొన్ని ప్రాంతాల్లో పనులు జరగటంతో కొంతమేర ఆయా రోడ్లు బాగుపడ్డాయి. పనులు జరగని చోట్ల వాహనాలు సరిగా తిరగలేని దుస్థితే ఉంది. అదే దక్షిణ తెలంగాణలో పనులు అంతగా జరగకపోవటంతో ఈ ప్రాంతాల్లో ఎక్కువ సమస్యలు నెలకొన్నాయి. ఇటీవలి వానల తర్వాత గుంతలు పూడ్చేందుకు రోడ్లు భవనాల శాఖ రూ.25 కోట్లు విడుదల చేసింది. కానీ అవి ఏ మూలకూ సరిపోని పరిస్థితి నెలకొంది.

తీర్చిదిద్దాలంటే వేల కోట్లు కావాలి
ఇప్పటికిప్పుడు 21 వేల కి.మీ రోడ్లపై గుంతలు పూడ్చి తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలంటే రూ.550 కోట్లు కావాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులు గుర్తించారు. ఆ నిధుల కోసం ఇప్పుడు ఆ శాఖ ఎదురుచూస్తోంది. గతంలో చేసిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన రూ.450 కోట్ల బిల్లులు బకాయి ఉండటంతో కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావటం లేదు. వీటిల్లో ఒక్క పాత పంచాయతీ రోడ్ల తాత్కాలిక మరమ్మతులకే రూ.250 కోట్లు అవసరం. వాటిని పూర్తిస్థాయి మరమ్మతు చేస్తూ సింగిల్‌ రోడ్లుగా కొత్త తారు పూతతో తీర్చి దిద్దాలంటే ఏకంగా రూ.3 వేల కోట్లు కావాలి. అదే రెండు వరుసలకు విస్తరించాలంటే రూ.5 వేల కోట్లు కావాలి. ముట్టుకుంటే ఇంత ఖర్చు కానుండటంతో రోడ్లు భవనాల శాఖ వాటి జోలికెళ్లటం లేదు.

వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై మరిపెడ–దంతాలపల్లి మధ్య రోడ్డు దుస్థితి. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఈ రోడ్డు పూర్తిస్థాయి మరమ్మతు జరిగింది. ఆ తర్వాత దాన్ని పట్టించుకున్న నాథుడు లేడు. అప్పట్నుంచీ తూట్లు పడుతూ పడుతూ ఇలా తయారయ్యింది. పెద్దపెద్ద గుంతలతో వాహనదారులకు నిత్యం నరకం చూపుతోంది. ఇటీవల దీని మరమ్మతుకు 3 పర్యాయాలు టెండర్లు పిలిస్తే, తారు (బిటమిన్‌) ధరలు బాగా పెరిగాయని చెప్పి కాంట్రాక్టర్లు 25శాతానికి పైగా ఎక్సెస్‌కు టెండర్లు దాఖలు చేయటంతో అధికారులు తిరస్కరించారు. తారు ధరల పెంపునకు తగ్గట్టు బిల్లులు చెల్లించే అవకాశం లేక జాతీయ రహదారుల విభాగం విషయాన్ని ఢిల్లీకి చేరవేసి మిన్నకుండిపోయింది. 

నిత్యం వేలాది వాహనాలు తిరిగే హైదరాబాద్‌–నల్లగొండ ప్రధాన రహదారి అంటే ఎవరైనా విస్తుపోవాల్సిందే. అంతలా ఈ రోడ్డు దెబ్బతింది. యుద్ధప్రాతిపదికన మరమ్మతు చేయాల్సి ఉండగా.. రకరకాల కారణాలు ఆటంకంగా మారాయి. ఫలితంగా వాహనదారులు ఈ రోడ్డుపై వెళ్లాలంటేనే భయపడుతున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top