ఎంసెట్‌: తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం

Telangana Key Decision On EAMCET - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎంసెట్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజ్‌ మార్కులు తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కరోనా వైరస్‌ కారణంగా ఇంటర్‌ పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. నిబంధనల ప్రకారం.. ఎంసెట్ పరీక్ష రాయాలంటే ఇంటర్‌లో కనీసం 45శాతం మార్కులు సాధించి ఉండాలి.  అయితే ప్రభుత్వం మాత్రం పాస్‌ మార్కులతో పరీక్షలు లేకుండానే ఫలితాలు విడుదల చేసింది.  దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం హైకోర్టును ఆశ్రయించారు. ఇంటర్‌ వెయిటేజ్‌ మార్కులను తొలగించాలని కోరారు. పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం తెలంగాణ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని జేఎన్టీయూని ఆదేశించింది.

ఈ క్రమంలోనే విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని సానుకూలంగా స్పందించిన సర్కార్‌.. ఎంసెట్‌ నిబంధనలను సవరిస్తూ గురవారం జీవో జారీచేసింది. ఎంసెట్‌లో ఇంటర్‌ వెయిటేజ్‌ మార్కులు తొలగిస్తూ తెలంగాణ నిర్ణయం తీసుకుంది. దీంతో ఎంసెట్‌లో మంచి ర్యాంక్‌ సాధించి ఇంటర్‌లో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు లబ్ధిపొందనున్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులు ఎవరైనా ఎంసెట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విధంగా విద్యాశాఖ వెసులుబాటు కల్పించింది.

ఈ ఏడాది ఇంటర్మీడియట్ సెకండియర్‌ పరీక్షలకు మొత్తం 4.11 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో ఎంపీసీ,బైపీసీ విద్యార్థులు 2,83,631 మంది ఉన్నారు. ఇందులో 1.75లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే ఎంసెట్‌కు కావాల్సిన 45శాతం కనీస మార్కులు పొందనివారికి... అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రూపంలో మరో అవకాశం ఉండేది. అందులో స్కోర్ పెంచుకుంటే ఆ తర్వాత ఎంసెట్‌కు అర్హత సాధించేవారు. కానీ ఈసారి ప్రభుత్వం కనీస మార్కులు 35తో ఫెయిలైనవారిని పాస్ చేయడంతో చాలామంది ఎంసెట్‌కు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం తాజా నిర్ణయంతో విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top