ఎత్తేస్తారా.. సడలిస్తారా?.. అన్ని వర్గాల్లో ఆసక్తికర చర్చ

Telangana: Experts Say Lifting of GO 111 Will not be Easy - Sakshi

జీవో 111పై అన్ని వర్గాల్లో ఆసక్తికర చర్చ

ఎత్తివేత సులభం కాదంటున్న నిపుణులు 

బాబు హయాంలోనే జీవోకు తూట్లు పొడిచే యత్నం..

ఓ ఆయిల్‌ కంపెనీకి అనుమతివ్వాలని కేంద్రానికి సిఫారసు.. నాటి సర్కార్‌ను తప్పుబట్టిన సుప్రీం

జీవో సమర్థ అమలుకు 2007లో హైకోర్టులో పిటిషన్‌.. 15 ఏళ్లుగా విచారణ

ఈ పరిస్థితుల్లో ఎత్తివేతకు, సవరణకు కోర్టులు అంగీకరించవనే వాదన 

సాక్షి, హైదరాబాద్‌: జీవో 111 ఎత్తివేత సులభమేనా? దీని అవసరం తీరిపోయిందా? దశాబ్దాల తరబడి జంట నగరాల ప్రజల దాహార్తిని తీర్చిన జంట జలాశయాల ప్రాధాన్యత తగ్గిపోయిందా? జీవో 111ను ఎత్తివేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన నేపథ్యంలో ఇలాంటి ప్రశ్నలెన్నో ఉత్పన్నమవుతున్నాయి. మిగతా అంశాల విషయం ఎలా ఉన్నా.. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ల పరిరక్షణ దృష్ట్యా ఆ జలాశయాల చుట్టూ 10 కిలోమీటర్ల పరివాహక ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు, భారీ నిర్మాణాలకు అనుమతి ఇవ్వరాదంటూ జారీ చేసిన జీవో 111 ఎత్తివేత మాత్రం అంత సులభం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

1996లో జీవో తెచ్చిన చంద్రబాబు ప్రభుత్వమే.. 1997లో దానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నించి విఫలం కావడాన్ని న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు. హైకోర్టులో దీనికి సంబంధించిన ఒక కేసు 15 ఏళ్లుగా కొనసాగుతుండటాన్ని కూడా వారు ప్రస్తావిస్తున్నారు. కాగా ఒకవైపు గ్లోబల్‌ వార్మింగ్‌ నేపథ్యంలో.. ఒక గంట వ్యవధిలోనే కుంభవృష్టి పడుతూ నగరాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఐటీ పరిశ్రమ, రియల్‌ ఎస్టేట్‌ రంగం ఈ ప్రాంతంలో విస్తృతంగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్న ప్రాంతంలో భూమి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం..జీవో ఎత్తివేయాలని కోరుతున్న పరీవాహక ప్రాంత రైతుల విన్నపాలు పరిగణనలోకి తీసుకుని ముందుకు వెళుతుందా? లేక పర్యావరణవేత్తల హెచ్చరికల దృష్ట్యా ఏవైనా కొన్ని సవరణలు, సడలింపులు దిశగా అడుగులు వేస్తుందా? జీవోలో సవరణలు/ఎత్తివేతకు న్యాయస్థానాలు అంగీకరిస్తాయా? అనేది చర్చనీయాంశంగా మారింది. 

జీవో తెచ్చిన ఏడాదికే తూట్లు పొడిచే యత్నం 
జంట జలాశయాల పరీవాహక ప్రాంతంలో ఓ ఆయిల్‌ కంపెనీ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలంటూ చంద్రబాబునాయుడు ప్రభుత్వం 1997లో కేంద్రానికి సిఫారసు చేసింది. ఈ వివాదం అప్పట్లో సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లను కాపాడుకోవాల్సిన ఆవశ్యతకను వివరిస్తూ అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పునిచ్చింది. జలాశయాలకు సమీపంలో పరిశ్రమలకు అనుమతులు ఇవ్వరాదని తేల్చిచెప్పింది. పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం ద్వారా వాటి నుంచి వెలువడే రసాయనాలు, ఇతర వ్యర్థాలతో జలాశయాలు కలుషితం అవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో జీవో 111ను ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న తాజా నిర్ణయం కూడా మరోసారి వివాదంగా మారే సూచనలు కన్పిస్తున్నాయి.  

15 ఏళ్లుగా హైకోర్టులో.. 
జీవో 111ను మరింత సమర్ధవంతంగా అమలు చేయాలంటూ పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్న డాక్టర్‌ ఎస్‌.జీవానందరెడ్డి 2007లో హైకోర్టులో దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యం ఇంకా విచారణ దశలో ఉంది. జీవో 111 పరిధిలో నిర్మాణాలు చేపట్టిన దాదాపు 30 సంస్థలను ఆయన ప్రతివాదులుగా చేరుస్తూ ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో జీవో 111ను ఎత్తివేయడం సులభమేమీ కాదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. జీవో 111కు సవరణలు చేయవచ్చేమో కానీ, పూర్తిగా ఎత్తేసే ప్రయత్నం చేస్తే జాతీయ స్థాయిలో ఉద్యమానికి దారితీస్తుందని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.  

ఆ నీళ్లకు కిలో లీటర్‌కు రూ.12–14 ఖర్చు 
కృష్ణా, గోదావరి నీటిని హైదరాబాద్‌కు తరలిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ జలాశయాల అవసరం లేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదన సమంజసంగా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి నదుల నుంచి మంచినీటి సరఫరా భారీ వ్యయంతో కూడుకున్నదని, హైదరాబాద్‌కు ఒక కిలోలీటర్‌ నీటిని తరలించేందుకు రూ.12–14 ఖర్చు అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ జంట జలాశయాల నుంచి సరఫరా చేసే లీటరు నీరు రూ.1.25 కంటే తక్కువని జలమండలి లెక్కలే చెబుతున్నాయి. మరోవైపు వరదలు వచ్చినప్పుడు నీటిని తరలించేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల ఆధారంగా నగరానికి నీటి తరలింపునకు ఏర్పాటు చేస్తున్నారని, వరదలు రాకపోతే పరిస్థితి ఏమిటని నిపుణులు అంటున్నారు.  

నివేదిక ఇవ్వని జీవోపై అధ్యయన కమిటీ..  
జీవో 111 పరిధిలో ఓ నిర్మాణానికి సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించిన జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) జీవో 111పై అధ్యయనం చేసేందుకు నిపుణులతో కమిటీ వేయాలని 2016లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్‌జీటీ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. 45 రోజుల్లో నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించింది. అయితే ఆరేళ్లు గడిచినా కమిటీ ఇప్పటికీ నివేదిక సమర్పించలేదు. మరోవైపు వట్టినాగులపల్లికి చెందిన కొందరు రైతులు ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. తమ గ్రామానికి చెందిన కొన్ని సర్వే నంబర్లు పరీవాహక ప్రాంతంలో లేకపోయినా జీవో 111 పరిధిలో చేర్చారని ఆరోపించారు. కొన్ని సర్వే నంబర్లను జీవో 111 పరిధి నుంచి తొలగించాలని పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధన సంస్థ (ఈపీటీఆర్‌ఐ) నివేదిక ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని వారు పేర్కొన్నారు.  

హైకోర్టు అనుమతి తప్పనిసరి  
జీవో 111ను మరింత సమర్థవంతంగా అమలు చెయ్యాలని, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ పరీవాహక ప్రాంతంలో ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలంటూ 2007 లోనే హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మరోవైపు ఈ జీవో సవరణలకు అనుమతి కోరుతూ 2010లో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్‌ దాఖలు చేసింది ఈ పిటిషన్‌ పలుమార్లు విచారణకు వచ్చినా హైకోర్టు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆ జీవోకు సవరణలు చేయాలన్నా, ఎత్తివేయాలన్నా హైకోర్టు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. 
– జనార్ధన్‌ గౌడ్, న్యాయవాది 

జీవో ఆవశ్యకమన్న సుప్రీంకోర్టు
హైకోర్టు, సుప్రీంకోర్టులో జీవో 111కు సంబంధించిన విచారణలు జరిగిన నేపథ్యంలో ఇప్పుడు ఆ జీవోను ఎత్తేయడం అంత సులభమైన విషయం కాదు. జీవో ట్రిపుల్‌ వన్‌ అత్యంత ఆవశ్యకమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. పలువురు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సైతం ఈ జీవోను సమర్థవంతంగా అమలు చేయాల్సిన ఆవశ్యకతను గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవోను ఎత్తేసే ప్రయత్నం చేస్తే పర్యావరణ అసమతుల్యత ఏర్పడే అవకాశం ఉంది. 
– బి.కొండారెడ్డి, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు

సవరణకు పలు ధర్మాసనాల విముఖత 
జీవో ట్రిపుల్‌ వన్‌ను సవరించాలంటూ దాఖలైన పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేసేందుకు గతంలో పలు హైకోర్టు ధర్మాసనాలు విముఖత వ్యక్తం చేశాయి. శ్రీనగర్‌లోని దాల్‌ లేక్‌ పరిసరాల్లో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదన్న నిబంధనలను సవరించి అక్కడ నిర్మాణాలకు అనుమతి ఇచ్చారని.. ఈ కేసు విచారణ సందర్భంగా ఓ న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. అదే తరహాలో జీవో ట్రిపుల్‌ వన్‌ను సవరించే ప్రయత్నం జరుగుతోందని ఆయన అప్పట్లో అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top