సర్కారు చేతికి... భూనిధి

Huge Benefit to Telangana Government With Abolition of 111 GO - Sakshi

111 జీవో రద్దుతో ప్రభుత్వానికి భారీ ప్రయోజనం

84 గ్రామాల్లో సమకూరనున్న 30 వేల ఎకరాలు

ఆంక్షల రద్దుతో మరింత విస్తరించనున్న ఐటీ రంగం 

ఊపందుకోనున్న స్థిరాస్తి రంగం 

ఆయా గ్రామాల్లో హర్షాతిరేకాలు

సాక్షి, రంగారెడ్డి జిల్లా/హైదరాబాద్‌: అనేక వివాదాలు ముసురుకున్న 111 జీవోను ఎత్తివేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ప్రయోజనం దక్కుతుంది. హైదరాబాద్‌ దాహార్తిని తీర్చే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జలాశయాల చుట్టూ ఉన్న ఆంక్షలను తొలగిస్తే దండిగా భూనిధి (ల్యాండ్‌ బ్యాంక్‌) సమకూరనుంది. 84 గ్రామాల్లో 30 వేల ఎకరాలకుపైగా భూములపై ఆంక్షలు తొలగనున్నాయి. ఐటీ హబ్‌గా అవతరించిన గచ్చిబౌలి ప్రాంతానికి ఈ జీవో పరిధి చేరువలో ఉన్నందున ఐటీ కంపెనీల స్థాపనకు ఈ ప్రాంతంవైపే ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. అదీగాక ఈ జీవోను సవరిస్తే ఐటీ పరిధి అటు చేవెళ్ల, శంకర్‌పల్లి, ఇటు కొత్తూరు వరకు విస్తరించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. తద్వారా ఈ ప్రాంతంలో స్థిరాస్తిరంగం కూడా మరింత ఊపందుకుంటుందని అంటున్నారు. 111 జీవో అవసరం తీరిపోయిందని, అర్థరహితమైన ఈ జీవోను ఎత్తివేస్తామని తాజాగా సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  
 
రద్దు చేయాలని డిమాండ్లు.. 
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ జలాశయాలను సంరక్షించేందుకు చుట్టూ పది కిలోమీటర్ల పరిధిని పరిరక్షణ ప్రాంతంగా ప్రకటిస్తూ 1996లో ప్రభుత్వం 111 జీవోను తెచ్చింది. అయితే, నగర నీటి అవసరాలను తీర్చేందుకు గోదావరి, కృష్ణాజలాలు సమృద్ధిగా అందుబాటులోకి వచ్చినందున.. ఈ జలాశయాల అవసరం పెద్దగా లేదని, నగరీకరణ నేపథ్యంలో ఈ జీవోను రద్దు చేయాలనే డిమాండ్లు కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో పలు పార్టీలు ఈ జీవోను ఎత్తివేస్తామని హామీ ఇచ్చాయి. టీఆర్‌ఎస్‌ కూడా ఈ జీవో ఎత్తివేతే ప్రధాన హామీగా ఎన్నికల బరిలోకి దిగింది. అయితే, ఈ అంశం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ), సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున అది సాధ్యపడలేదు. జలాశయాల దిగువ ప్రాంతంలో ఆంక్షలు సహేతుకం కాదని, ఈ ప్రాంతాన్ని మినహాయించాలని, నగరీకరణను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కొందరు ఎన్‌జీటీని ఆశ్రయించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఓ కమిటీని కూడా నియమించింది. ఈ కమిటీ నివేదిక అందనప్పటికీ సీఎం కేసీఆర్‌ ఈ జీవోను ఎత్తివేయనున్నట్లు ప్రకటించడం విశేషం. 
 
అభ్యంతరాలు... హర్షాతిరేకాలు 
సీఎం ప్రకటనపై పర్యావరణవేత్తల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నా.. జీవో అమల్లో ఉన్న 84 గ్రామాల్లో మాత్రం హర్షాతిరేకాలు వ్యక్తమవు తున్నాయి. న్యాయపరమైన చిక్కులు, కమిటీ నివేదిక సానుకూలంగా వస్తే గనుక జీవో రద్దు కానుంది. తద్వారా 111 జీవో పరిధిలో 30 వేల ఎకరాలకుపైగా ఉన్న సర్కారు భూమిపై ఆంక్షలు తొలగనున్నాయి. ఇప్పటికీ ఈ భూమి సర్కారుదేనైనా.. అభివృద్ధికి జీవో అడ్డుగా మారడంతో ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. కేవలం 10 శాతం విస్తీర్ణం భూమిని మాత్రమే వినియోగించుకోవాలని, మిగతా దాన్ని పరిరక్షించాలనే నిబంధన వల్ల పెట్టుబడులు పెట్టే సంస్థలకు భూకేటాయింపు అడ్డుతగులుతోంది. దీనికితోడు కాలుష్యం పేరిట పరిశ్రమల ఏర్పాటును ఈ జీవో వ్యతిరేకిస్తున్నందున పరిశ్రమలు పెట్టేవారికీ స్థలాలు ఇవ్వలేని పరిస్థితి. ఇక ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే లక్షలాది ఎకరాల ల్యాండ్‌ బ్యాంకు ఉంది. ఆంక్షల వల్ల ఈ భూమి.. సాగు, ఫాంహౌజ్‌లు, రిక్రియేషన్‌ జోన్లకే పరిమితమైంది. జీవో ఎత్తివేతతో ఈ భూమి కూడా విడుదల కానుంది. 
 
జీవో ఎందుకు తెచ్చారంటే? 
ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ పరీవాహక ప్రాంతం పరిరక్షణ కోసం ప్రభుత్వం 1994 మార్చి 31న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 192 జీవోను తెచ్చింది. దాన్ని సవరిస్తూ 1996 మే 8న 111 జీవోను విడుదల చేసింది. జంట జలాశయాల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో వాణిజ్య, పారిశ్రామిక నిర్మాణాలు, లే అవుట్‌లు, బహుళ అంతస్తుల భవన నిర్మాణాలను నిషేధించింది. తమ అభివృద్ధికి ఈ జీవో అడ్డుగా మారిందంటూ 84 గ్రామాల్లోని రైతులు గతంలో ఆందోళనకు దిగారు. జీవోను ఎత్తివేయాలంటూ ఆయా గ్రామాల సర్పంచ్‌లు రెండుసార్లు మూకుమ్మడిగా తీర్మానాలు చేసి పంపారు. జీవోను సమీక్షించేందుకు మూడేళ్ల క్రితం జాతీయ హరిత ట్రిబ్యునల్‌ అంగీకరించింది.  

తలెత్తుతున్న ప్రశ్నలెన్నో.. 
జీవో ఎత్తివేతపై సీఎం కేసీఆర్‌ ప్రకటన నేపథ్యంలో అనేక చిక్కు ప్రశ్నలు తెర మీదికొస్తున్నాయి. ఇది ఎలా సాధ్యమనే చర్చ సర్వత్రా జరుగుతోంది. జీవో ఎత్తివేయాలన్నా.. సమీక్షించాలన్నా సుప్రీంకోర్టు అనుమతి తప్పనిసరి. జీవో ఎత్తివేత అంశం ప్రభుత్వం చేతిలో ఉందా? ఒకవేళ జీవోను ఎత్తివేస్తే.. ప్రభుత్వం ఎన్జీటీ, సుప్రీం కోర్టుకు ఏమని సమాధానం చెబుతుంది? జంట జలాశయాల పరిరక్షణకు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు చేపడతారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  

పర్యావరణవేత్తల అభ్యంతరాలివీ.. 
111 జీవోను ఎత్తివేస్తే రియల్‌ఎస్టేట్, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు పెరిగి స్వచ్ఛమైన జంట జలాశయాలు గరళ సాగరాలుగా మారతాయి. 
వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణా, గోదావరి జలాల తరలింపునకు అయ్యే ఖర్చు కంటే హైదరాబాద్‌కు ఆనుకొని ఉన్న ఈ జలాశయాల ద్వారా తక్కువ ఖర్చుతో దాహార్తిని సమూలంగా తీర్చే అవకాశం ఉంది. 
జలాశయాల క్యాచ్‌మెంట్‌ ఏరియాలు కాంక్రీట్‌ మహారణ్యంలా మారి వర్షపు నీటిని చేర్చే ఇన్‌ఫ్లో చానల్స్‌ పూర్తిగా మూసుకుపోతాయి. 
జలాశయాల శిఖం భూముల్లో అక్రమంగా వెలిసే ఫాంహౌస్‌లు, ఇంజనీరింగ్‌ కళాశాలలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్ల సంఖ్య మరింత పెరుగుతుంది. దీంతో జలాశయాలకు మరణశాసనం లిఖించినట్లవుతుంది. 
పర్యావరణ విధ్వంసం జరుగుతుంది. భూగర్భజలాలు తగ్గుతాయి. హైదరాబాద్‌కు వరదల ముప్పుంటుంది. 
పంటపొలాలు రియల్‌ వెంచర్లుగా మారి హరిత వాతావరణం కనుమరుగవుతుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top