‘సాక్షి’ పరిశీలన: డాక్టర్‌ సారు.. ఉంటలేడు!

Telangana Doctors not interested medical services Not Working In Hospitals - Sakshi

వైద్య సేవలకు ఆసక్తి చూపని డాక్టర్లు

సమయపాలన పాటించని వైద్య సిబ్బంది

బయోమెట్రిక్‌ హాజరు లేకపోవడంతో ఇష్టారాజ్యం

రోగులకు తప్పని ఎదురుచూపులు.. ప్రైవేటుకు పరుగులు

సర్కార్‌ వైద్యం సరిగా అందడం లేదంటున్న బాధితులు 

వైద్య సేవలకు ఆసక్తి చూపని డాక్టర్లు.. సమయపాలన పాటించని వైద్య సిబ్బంది  

తన కూతురికి తానే వైద్యం చేసుకుంటున్న పరిస్థితి నిర్మల్‌ జిల్లా పెంబి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనిది. ఉదయం 9.30గంటలైనా అక్కడ వైద్య సిబ్బంది లేకపోవడంతో రోడ్డు ప్రమాదంలో గాయపడిన కూతురికి తండ్రే డ్రెస్సింగ్‌ చేసుకున్నారు. 9.45 గంటలకు ల్యాబ్‌ టెక్నీషియన్‌ రాగా, పది గంటలకు ఫార్మసిస్టు వచ్చారు.

వైద్యుడు, స్టాఫ్‌నర్సు శిక్షణకు వెళ్లడంతో రోగులకు ఇబ్బందులు తప్పలేదు. ఇదే మండలం పస్పుల గ్రామానికి చెందిన బాలిక రెండు రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం రాగా, సిబ్బంది లేకపోవడంతో తండ్రే మందు పూసి కట్టుకట్టాడు.  

కోయిలకొండ మండలానికి చెందిన అంబటిదాస్‌చౌహన్‌ భార్య ఊట్కూర్‌ మండలం రాంరెడ్డిగూడెంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం మధ్యాహ్నం భార్యాబిడ్డలను చూసి మహబూబ్‌నగర్‌కు వస్తున్న క్రమంలో గోప్లాపూర్‌ సమీపంలోని రహదారిపై అంబటిదాస్‌ బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం దేవరకద్ర పీహెచ్‌సీకి తెచ్చారు.

అక్కడ డాక్టర్‌ సెలవులో ఉండటంతో సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. పది నిమిషాలపాటు బాధితుడిని ఆటోలో ఎండలోనే ఉంచారు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ భగవంత్‌ రెడ్డి బాధితుడిని 108 అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి పంపించారు. గాయాలపాలైన అతడిని అంబులెన్స్‌లో ఎక్కించే సమయంలో సిబ్బంది కనీసం ప్రథమ చికిత్స కూడా చేయకుండా కేవలం రెండు ఇంజెక్షన్లు ఇచ్చి పంపించారు. అంబటిదాస్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు.  

పెద్దపల్లి జిల్లాకు చెందిన ఈయన పేరు మహ్మద్‌ అలీ. ఈ నెల 20న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. తీవ్రమైన రక్తస్రావంతో కరీంనగర్‌లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అక్కడున్న నర్సులు రక్తం తుడిచి కుట్లు కుట్టి సూదిమందు ఇచ్చారు. వారే మందులు ఇచ్చారే కానీ డాక్టర్‌ ఎవరూ రాలేదు. ఉదయం 11 గంటల తర్వాత గానీ డాక్టర్‌ వచ్చిన పాపాన పోలేదని ఆయన కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.  

సాక్షి, నెట్‌వర్క్‌/హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీ) మొదలు ఏరియా, జిల్లా, బోధనాసుపత్రుల వరకు ఇదే తంతు. డాక్టర్లు హాజరుకాకపోవడం, వచ్చినా సకాలంలో రాకపోవడంతో అవస్థలు పడుతున్నామని రోగులు వాపోతున్నారు. కొందరు వైద్యులు సొంతంగా ప్రైవేట్‌ క్లినిక్‌లు పెట్టుకోగా, మరికొందరు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో పనిచేస్తూ ప్రభుత్వ వైద్య సేవల పట్ల నిర్లక్ష్యం చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సుస్తీ చేసిందని వస్తే బాగుచేసే వారే ఉండ టం లేదంటున్నారు. కొందరు డాక్టర్లయితే హైదరాబాద్‌లోనే ఉంటూ నిజామాబాద్, మెదక్, మహ బూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు వెళ్లి వస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో వైద్యులు విధులకు హాజరయ్యే తీరుపై ‘సాక్షి’మంగళవారం జరిపిన పరిశీలనలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.  

వారానికి ఒకట్రెండు రోజులు 
వైద్య ఆరోగ్యశాఖ వర్గాల లెక్కల ప్రకారం వారానికి రెండ్రోజులు మాత్రమే విధులకు హాజరయ్యే డాక్టర్లు దాదాపు 50% మంది ఉంటారు. మరీ ముఖ్యంగా పీహెచ్‌సీలకు వెళ్లే డాక్టర్లయితే వారానికి ఒకసారి వెళ్లేవారే ఎక్కువ. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు గగనమయ్యాయని బాధితులు వాపోతున్నారు. సర్కారు వైద్యంపై నమ్మకం లేకుండా పోతోందని అంటున్నారు.

వైద్యులు ఎప్పుడొస్తారో... ఎప్పుడు వెళ్తారో తెలియక చాలామంది సర్కారు ఆసుపత్రులకు రావడానికి జంకుతున్నారు. వైద్యాధికారుల హాజరును పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన బయోమెట్రిక్‌ పరికరాలు చాలాచోట్ల పనిచేయడంలేదు. కొన్నిచోట్ల వైద్య సిబ్బందే వాటిని పనిచేయకుండా చేసినట్లు సమాచారం. వీరి విధులను పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారులు ఇటీవల ఆస్పత్రులను విజిట్‌ చేసిన దాఖలాల్లేవు. అదీగాక విధులకు ఎగనామం పెడుతున్న వైద్యులపై కనీస చర్యల్లేవని అంటున్నారు. 

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో... 
కరీంనగర్‌ జిల్లా ఆçస్పత్రితోపాటు హుజూరాబాద్, జమ్మికుంట ఏరియా ఆస్పత్రులు, 18 పీహెచ్‌సీలు, 6 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కడా కూడా వైద్యులు సకాలంలో రావట్లేదు. వైద్యులు 11 గంటలకు వచ్చి ఒంటి గంటకే వెళ్లిపోతున్నారు.  
కరీంనగర్‌ జిల్లా ఆసుపత్రిలో మధ్యాహ్నం 2 గంటల వరకు ఓపీ గదుల్లో కూర్చొని రోగులను చూడాల్సి ఉన్నా అమలుకావడం లేదు. సీనియర్‌ డాక్టర్లు కేవలం ఇన్‌పేషంట్‌గా చేరిన వారినే పరీక్షించి వెళ్లడం పరిపాటిగా మారింది. కొందరు వైద్యులైతే వారంలో రెండు మూడు రోజులు మాత్రమే హాజరై. రిజిస్టరులో వారం రోజులు హాజరైనట్లు సంతకాలు చేస్తున్నారు.  
పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌ మండలంలోని పీహెచ్‌సీలో ఉదయం 9 గంటల నుంచే వైద్యసేవలు అందించాల్సి ఉండగా, వైద్యులు 10.30 గంటలకు చేరుకున్నారు. ఉదయం 9.30 గంటలకు కేవలం ఫార్మసిస్టు, ఎన్‌సీడీ, ఒక్క స్టాఫ్‌ నర్స్‌ మాత్రమే ఉన్నారు. జిల్లాలో ఉన్న దాదాపు అన్ని పీహెచ్‌సీల్లో ఇదే దుస్థితి. 

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో... 
ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాద్‌ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలు సామాజిక ఆసుపత్రుల్లో వైద్యులు కొరత ఉంది. పని చేస్తున్న వారు సైతం సమయానికి రావడం లేదు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌ జిల్లాల్లో గిరిజన ప్రాంతాల్లో పని చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఉన్నవారితోనే నెట్టుకొస్తున్నారు.

ఉమ్మడి మెదక్‌ జిల్లా... 
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో మొత్తం 93 ప్రభుత్వాస్పత్రులు ఉన్నాయి. ఇందులో 3 జిల్లా కేంద్ర ఆస్పత్రులు, మిగతావి పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, అర్బన్‌ పీహెచ్‌సీ, సీహెచ్‌సీలున్నాయి. ‘సాక్షి’ బృందం 66 ఆస్పత్రులను విజిట్‌ చేసింది. వైద్యులు సమయానికి విధులకు రాకపోవడంతో పేదలకు వైద్యం అందట్లేదు. నర్సులు, కింది స్థాయి సిబ్బంది మందుబిళ్లలు ఇచ్చి పంపుతున్నారు. 
సంగారెడ్డి జిల్లా జోగిపేట ఏరియాస్పత్రిలో బయోమెట్రిక్‌ ఏళ్లుగా పనిచేయడంలేదు. దీంతో పనిచేసే వారు ఎప్పుడు వస్తున్నారో... ఎప్పుడు వెళ్తున్నారో అడిగే నాథుడే లేరు. 
సంగారెడ్డి జిల్లాలోని మారుమూల మండలం పుల్కల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఉదయం 11 దాటినా వైద్యులెవరూ రాకపోవడంతో రోగులు తీవ్ర నిరాశతో తిరిగి వెనుదిరిగారు. ఒక్క నర్సే విధులకు హాజరయ్యారు.  

ఉమ్మడి వరంగల్‌ జిల్లా... 
వరంగల్‌ జిల్లా నెక్కొండ పీహెచ్‌సీకి వైద్యాధికారితోపాటు ఇతర సిబ్బంది వరంగల్‌ నుంచి రోజూ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో వచ్చి వెళ్తుంటారు. వీరు 9 గంటలకు రావాల్సి ఉండగా రైలు రాకపోకలతో వారు వచ్చే సమయం 10 దాటుతుంది. అందుకే రోగులూ పది దాటాకే వస్తున్నారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు విధులకు వచ్చారు.  
వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి వచ్చే రోగులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఓపీ చికిత్స అందిస్తుంటారు. మంగళవారం ఉదయం 9 గంటలకు రావాల్సిన వైద్యులు అర్ధగంట ఆలస్యంగా వచ్చారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ విధులకు హాజరు కాలేదు.

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా... 
మహబూబ్‌నగర్‌ జిల్లాలో జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆస్పత్రుల్లో మినహాయిస్తే ఇతరచోట్ల ఎక్కడా వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. జనరల్‌ ఆస్పత్రిలో సీనియర్లు ఆలస్యంగా వచ్చి.. త్వరగా వెళ్లిపోతున్నారు. దీంతో హౌస్‌సర్జన్‌లపైనే భారం పడుతోంది.  
వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో పలు పీహెచ్‌సీల్లో బయోమెట్రిక్‌ పనిచేయడం లేదు.  

ఖమ్మం జిల్లాలో.. 
ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆస్పత్రిలో న్యూరాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలకు చెందిన డాక్టర్లు ఉదయం 11 గంటల వరకు కూడా రాలేదు. దీంతో చాలామంది రోగులు గంటల తరబడి వేచిచూసి వెనుదిరిగారు.  


మధ్యాహ్నం 12కు కూడా తాళం వేసి ఉన్న కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు పీహెచ్‌సీ ఇన్‌ పేషెంట్‌ వార్డు 

సత్తుపల్లి ఏరియా ప్రభుత్వాస్పత్రిలో 21 మంది వైద్యులకు 9 మంది విధుల్లో ఉన్నారు. మిగతా 12 మంది చాలాకాలంగా గైర్హాజరవుతున్నారు. వైద్యులు, సిబ్బంది బయోమెట్రిక్‌ మిషన్‌ను వాడట్లేదు. జాతీయ రహదారిపై నిత్యం రోడ్డు ప్రమాదాల్లో గాయపడే వారు చికిత్స కోసం వస్తే అక్కడ ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ ఉండడంలేదు. ఆయన దీర్ఘకాలిక సెలవులో వెళ్లడంతో ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు తీయాల్సి వస్తోంది. 

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. 
నల్లగొండ జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆస్ప త్రిలో కొందరు ఆలస్యంగా వస్తున్నారు. మెడికల్‌ కళాశాలకు చెందిన ప్రొఫెసర్లు, అసోసి యేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు  హైదరాబాద్‌ నుంచి రాకపోకలు సాగిస్తుండటంతో కొందరు ఆలస్యంగా వస్తున్నారు.  


రామన్న పేటలో ఉదయం 10:30కు కూడా సిబ్బంది లేక ఖాళీగా గైనకాలజీ క్లినిక్‌ 

తుంగతుర్తిలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో 10:30 గంటల వరకు కూడా ఎక్స్‌రే గదికి తాళం తీయలేదు. సూర్యా పేట జనరల్‌ ఆస్పత్రిలోని ఆర్థోపెడిక్‌ విభాగం, జనరల్‌ మెడిసిన్‌ వైద్యులు ఉదయం 8 గంటలకు రావాల్సి ఉండగా 10.30 గంటల తర్వాత వచ్చారు. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని గైనకాలజిస్టు వైద్యులు ఏ ఒక్కరూ ఉదయం 11 వరకు అందుబాటులో లేరు. దీంతో గర్భిణులు గంటల తరబడి ఎదురు చూశారు.  
సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు పీహెచ్‌సీలో డాక్టర్‌ మధ్యాహ్నం 12 గంటలకు వచ్చారు. ఆస్పత్రిలో బయోమెట్రిక్‌ పనిచేయడంలేదు.

డాక్టర్లు ఆలస్యంగా వస్తున్నారు
నేను ఉదయం 9 గంటలకు పెద్దాసుపత్రికి వచ్చాను. జ్వరం బాగా వచ్చింది. తొందరగా చూపించుకొని వెళ్దామంటే డాక్టర్‌ 11.30కు వచ్చారు. టెస్టులు రాసిస్తే, చేసుకొని వచ్చే సరికి డాక్టర్‌ వెళ్లిపోయాడు. 1.30 గంటలకు కొత్త డాక్టర్‌ పరీక్షల చిట్టి చూసి మందులు రాశారు.     

– లక్ష్మీ, కరీంనగర్‌ 

ఎప్పుడొచ్చినా సారు ఉంటలేడు 
నేను గర్భవతిని. కడుపులో నొప్పి అనిపిస్తే ఉదయం 9.30 గంటలకు పిట్టబొంగరంలోని దావఖానకు అచ్చిన. అచ్చినప్పటి నుంచి డాక్టర్‌ సారు లేడు. పది దాటినంక ఒక్కొక్కరు వచ్చారు. అయినా సారు రాలేదు. నొప్పి భరించలేక లోపలికి వెళ్లి సిస్టరమ్మకు చెబితే మందులిచ్చింది. ఇక్కడికి ఎప్పుడు వచ్చిన డాక్టర్‌ కనిపించడు. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు.  

– కినక శశిక, పిట్టబొంగరం, ఇంద్రవెల్లి మండలం, ఆదిలాబాద్‌ జిల్లా 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top