‘ముక్కోటి’కి యాదాద్రి ముస్తాబు  | Sakshi
Sakshi News home page

‘ముక్కోటి’కి యాదాద్రి ముస్తాబు 

Published Mon, Jan 2 2023 12:25 AM

Telangana: Devotees Darshan From North Door Of Yadadri Temple - Sakshi

యాదగిరిగుట్ట: వైకుంఠ (ముక్కోటి) ఏకాదశికి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంతో పాటు అనుబంధంగా ఉన్న పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముస్తాబయ్యాయి. సోమవారం యాదాద్రీశుడు వైకుంఠనాథుడిగా ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రధానాలయం ప్రారంభమయ్యాక తొలి సారిగా వస్తున్న వైకుంఠ ఏకాదశి కావడంతో ఇది చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ప్రధానాలయం పనులు జరుగుతున్న సందర్భంగా బాలాలయంలో తూర్పు ద్వారం గుండానే భక్తులకు శ్రీస్వామి వారు దర్శనం ఇచ్చారు. ఈ సారి ప్రధానాలయంలో ఉత్తర ద్వారం ఏర్పాటు చేయడంతో ఉత్తర రాజగోపురం నుంచి భక్తులకు వైకుంఠనాథుడి దర్శన భాగ్యం కల్పిస్తారు.  

ప్రధానాలయంలో.. 
వైకుంఠ ద్వార దర్శనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయంలో రంగురంగుల పుష్పాలు, మామిడి, అరటి తోరణాలు, విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. భక్తులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సరిపడా పులిహోర, లడ్డూ మహా ప్రసాదాలను సిద్ధం చేశారు. ప్రధానాలయంలో సోమవారం ఉదయం 6.48 గంటలకు శ్రీస్వామివారు వైకుంఠనాథుడిగా దర్శనం ఇవ్వనున్నారు. ఈ వేడుకల్లో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. 

పాతగుట్టలో.. 
వైకుంఠ ఏకాదశి సందర్భంగా పాతగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కూడా ఉదయం 6.48 గంటలకు ఉత్తర ద్వారానికి శ్రీస్వామి వారిని వేంచేపు చేయించి భక్తులకు దర్శనం కల్పించనున్నారు. అనంతరం శ్రీస్వామి వారిని ఆలయ ముఖ మండపంలో అధిష్టింపచేసి, క్యూలైన్లలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఉదయమే భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉన్నందున్న ఉత్తరం వైపు భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆలయాన్ని తెరిచి సుప్రభాతం, ఆరాధన, తిరుప్పావై నిర్వహించి, అలంకార సేవను ఏర్పాటు చేస్తారు. ఉదయం 6.48 గంటల నుంచి 7 గంటల వరకు వైకుంఠద్వార దర్శనం, ఉదయం 8 నుంచి 9 గంటల వరకు అలంకార దర్శనం కల్పిస్తారు.

నేటి నుంచి అధ్యయనోత్సవాలు..
యాదాద్రీశుడి ఆలయంలో సోమవారం నుంచి ఈనెల 6వతేదీ వరకు ఐదు రోజుల పాటు అధ్యయనోత్సవాలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాలలో విశేష అలంకార సేవలు నిర్వహిస్తారు. ఐదురోజులపాటు లక్ష్మీ సమేతుడైన నారసింహుడు దశావతారాలతో ఉదయం, సాయంత్రం ప్రత్యేక అలంకరణ సేవల్లో తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. అధ్యయనోత్సవాలు జరిగే ఐదు రోజుల పాటు భక్తులు నిర్వహించే మొక్కు, శాశ్వత బ్రహ్మోత్సవాలు, నిత్య, శాశ్వత కల్యాణోత్సవాలు, శ్రీసుదర్శన నారసింహ హోమం రద్దు చేశారు.  

Advertisement
 
Advertisement
 
Advertisement