CM KCR: ఆ 4 గనుల వేలం ఆపండి

Telangana CM KCR Urges PM Narendra Modi To Stop Auction Of Singareni Coal Blocks - Sakshi

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. వేలాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలోని అన్ని కార్మిక సంఘాలు గురువారం నుంచి మూడు రోజులపాటు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రధానికి సీఎం కేసీఆర్‌ లేఖ రాశారు.

సాలీనా 65 మిలి యన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులోని థర్మల్‌ పవర్‌ స్టేషన్ల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలకభూమిక పోషిస్తోందని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ జూన్‌ 2014లో 5,661 మెగావాట్లు ఉండగా, 2021 మార్చి నాటికి 13,688 మెగావాట్లకు పెరిగిందని, ఈ నేపథ్యంలో విద్యుత్‌ ఉత్పత్తికి నిరంతరాయంగా బొగ్గు సరఫరా చేయడం చాలా కీలకమని పేర్కొన్నారు.

సింగరేణిలో బొగ్గు అవసరాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అనేక మైనింగ్‌ లీజులను మంజూరు చేసిందని, దానికి కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కూడా ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ట్రాంచ్‌ 13 కింద జేబీఆర్‌ఓసీ–3, శ్రావణ్‌పల్లి ఓసీ, కోయగూడెం ఓసీ–3, కేకే –6 యూజీ బ్లాక్‌లను వేలం వేస్తే సింగరేణి పరిధిలోని బొగ్గు అవసరాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ నాలుగు బ్లాకుల వేలం నిలిపివేతకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖను ఆదేశించాలని ప్రధానిని కోరారు. ఈ బ్లాక్‌లను సింగరేణికే కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top