నేడు రాష్ట్ర మంత్రివర్గం భేటీ
భూముల విలువల పెంపునకు ఆమోదం తెలిపే అవకాశం
రుణాల రీస్ట్రక్చర్, ఆదాయ లీకేజీలను అరికట్టే ప్రణాళికపై చర్చ!
ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలపైనా స్పష్టత వచ్చే చాన్స్
సాక్షి, హైదరాబాద్: అనివార్య ఖర్చులు, నెలనెలా పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తట్టుకుని నిలబడేందుకు అవసరమైన ఆదాయ మార్గాలపై చర్చ ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గం సోమవారం భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం మూడు గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈసారి కేబినెట్ సమావేశంలో ఆదాయ వనరుల సమీకరణపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చే నివేదికపైనే చర్చ జరుగుతుందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. అందులో భాగంగానే రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల విలువల పెంపునకు గ్రీన్‌సిగ్నల్ లభించనుందని సమాచారం.
భూముల విలువల సవరణకు సంబంధించిన ప్రక్రియను రిజిస్ట్రేషన్ల శాఖ పూర్తి చేసిన నేపథ్యంలో మంత్రివర్గం ఆమోదిస్తే ఈనెలలోనే, లేదంటే జూన్1వ తేదీ నుంచి సవరించిన విలువలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. దీంతో పాటు రుణాల రీస్ట్రక్చర్ కోసం కేంద్రానికి చేయాల్సిన ప్రతిపాదనలు, రాబడి శాఖల్లో లీకేజీలను అరికట్టడం లాంటి అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించి తగు నిర్ణయాలు తీసుకోనుంది.
అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన దాదాపు రూ.14 వేల కోట్ల బకాయిల విషయంలోనూ ఓ రోడ్‌మ్యాప్ తయారు చేయనున్నట్టు సమాచారం. ముఖ్యంగా రిటైరయిన ఉద్యోగులకు సంబంధించిన రూ.8 వేల కోట్ల బకాయిలను 100 రోజుల్లో చెల్లించే విషయంలో ఏం చేయాలన్న దానిపై మంత్రివర్గం ఓ కార్యాచరణ రూపొందించనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీంతో పాటు తుమ్మిడిహెట్టి బరాజ్ నిర్మాణం.. తదితర అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించనుంది.


