సోషల్‌ మీడియాలో రెండుగా చీలుతున్న స్నేహితులు

Social Media War Between Friends - Sakshi

దేశంలోని తాజా పరిణామాలపై పరస్పరం ఆరోపణాస్త్రాలు

హోరెత్తిపోతున్న వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌

వారంతా స్నేహితులే.. ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరు, ఎక్కడ ఉన్నా నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా ‘టచ్‌’లో ఉండే వ్యక్తులే... జీవన ప్రయాణంలోని ఘట్టాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ పోస్టులు, లైక్‌లు, షేర్లు, కామెంట్లతో పలకరించుకొనే వారే... కానీ అంతటి ఆప్తమిత్రులు కూడా గత కొన్ని వారాలుగా దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో బద్ధ విరోధులుగా మారిపోయారు! ముఖ్యంగా రైతుల ఉద్యమం, పెట్రోల్‌ ధరలు, గ్యాస్‌ సబ్సిడీ, బడ్జెట్‌ కేటాయింపులపై అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలిపోయి పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు!! తమ మనోభావాలకు అద్దంపట్టేలా చురుక్కుమనిపించే డీపీ (డిస్‌ప్లే పిక్చర్‌), షాకిచ్చే వాట్సాప్‌ స్టేటస్‌లను లోకానికి తెలియజేస్తూ చెలరేగిపోతున్నారు.

సాక్షి, హైదరాబాద్‌ : దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో గత కొన్ని నెలలుగా రైతులు చేపడుతున్న నిరసన ఇప్పుడు జాతీయ స్థాయిలోనేగానే కాక అంతర్జాతీయ అంశంగా మారింది. వివిధ దేశాలకు చెందిన సెలబ్రిటీలు రైతులకు మద్దతుగా ట్వీట్‌ చేయడంతో దేశంలోని స్టార్లు రంగంలోకి దిగారు. దీంతో వారి అభిమానులు కూడా వాటిని రీ ట్వీట్లు, షేర్లు, లైక్‌లు, డిస్‌లైక్‌లు కొడుతూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. అనుకూలంగా వీడియోలు, మీమ్స్‌ రూపొందిస్తూ క్షణాల్లో వైరల్‌గా మార్చేస్తున్నారు. ఇక్కడ అనుకూల, వ్యతిరేక వర్గాల్లో వీటికి మంచి ఆదరణ రావడం గమనార్హం. 

రాత్రీపగలు వాదోపవాదాలు... 
కొన్ని వారాలుగా వాట్సాప్‌ గ్రూపుల్లో మిత్రులు అనుకూల, వ్యతిరేక ఆధారాల (ఆయుధాల)ను టైమింగ్‌తో ప్రయోగిస్తున్నారు. తమ వాదనే సరైందని చాటిచెప్పేందుకు వీడియో లింకులు, స్క్రీన్‌ షాట్లు, న్యూస్‌ క్లిప్పింగ్‌లను సోషల్‌ మీడియాలో పెడుతున్నారు. ఇంకొందరు స్టిక్కర్లతో వెక్కిరిస్తున్నారు. ఈ వాట్సాప్‌ యుద్ధాలు తెల్లవారకముందే మొదలై.. అర్ధరాత్రి అయినా ఆగట్లేదు.

సున్నిత మనస్కులతో తస్మాత్‌ జాగ్రత్త..!
సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు సాగిస్తున్న వాదోపవాదాలు కొన్నిసార్లు గతి తప్పుతున్నాయి. తాము అభిమానించే వ్యక్తి, సంస్థ, పార్టీ, వ్యవస్థలను ఇతరులు విమర్శిస్తుంటే తట్టుకోలేక వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దిగుతున్నారు. కొన్ని సందర్భాల్లో బెదిరింపులు లేదా భౌతిక దాడులకు దిగేందుకు సైతం వెనుకాడక సామాజిక సంబంధాలను చేతులారా దెబ్బతీసుకుంటున్నారు. ఇంకొందరేమో మనసు పాడుచేసుకుంటూ కుంగిపోతున్నారు. ఆ కోపాన్ని ఇంట్లో, ఆఫీసులో ప్రదర్శిస్తూ వారికి వారే నష్టం చేసుకుంటున్నారు. అయితే సామాజిక మాధ్యమాల ద్వారా వివిధ అంశాలను పంచుకోవడం వరకు పరిమితమైతే చాలని సైకాలజిస్టులు చెబుతున్నారు. వివాదాస్పద చాటింగ్‌లు, పోస్టులు వ్యక్తిగత జీవితాన్ని కటకటాల పాలుజేసి, కుటుంబాలను కూడా తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతుందన్న సంగతి మర్చిపోవద్దని హెచ్చరిస్తున్నారు. అలాంటి వారితో వాదనలకు దిగకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. 

కంపెనీలు గమనిస్తుంటాయి
సోషల్‌ మీడియాలో విరుచుకుపడే వారిలో అధిక శాతం మంది ముసుగు వీరులే. నిజ జీవితంలో వారు అంత ధైర్యవంతులు కాదు. అందుకే వారి అసంతృప్తిని ఎదుటివారిపై వెళ్లగక్కుతుంటారు. లోకంలో ప్రతి మనిషి వ్యక్తిత్వంలోనూ వైరుధ్యాలు ఉంటాయి. వాటిని గౌరవించాలి. అంతేకానీ వ్యక్తిగతంగా కోపాన్ని ప్రదర్శించవద్దు. ముఖ్యంగా యువతకు ఇది మంచిది కాదు. అవతలి వారిపై మాటల దాడి చేస్తున్నామనుకుంటున్నా.. మీ అసలు రూపా న్ని సోషల్‌ మీడియా ముందు పెడుతున్నారన్న సంగతి మరువద్దు. ఎందుకంటే భవిష్యత్తులో మీకు ఉద్యోగం ఇచ్చే కంపెనీలు మీ సోషల్‌ ఖాతాలనూ గమనిస్తాయన్న విషయాన్ని మర్చిపోవద్దు.      – వీరేందర్, సైకాలజిస్టు 

ప్రపంచవ్యాప్తంగా సోషల్‌ లెక్కలు... (అంకెలు: ప్రతి నిమిషానికి) 
ఫేస్‌బుక్‌ ఫొటోలు:     1,47,000 
ఫేస్‌బుక్‌ షేర్స్‌:     1,50,000 
వాట్సాప్‌ చాట్‌:     4,16,66,667 
ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులు:     1,38,889 
ఇన్‌స్టాగ్రామ్‌ చాట్స్‌:     3,47,222 
టిక్‌టాక్‌:     2,704 
యూట్యూబ్‌ వీడియోలు:     500 గంటలు 
ప్రపంచవ్యాప్తంగా డేటా 
వినియోగదారులు:     457 కోట్లు 
(సోర్స్‌: యూఎస్‌ కేంద్రంగా నడిచే డొమో కంపెనీ 
‘డేటా నెవర్‌ స్లీప్స్‌ 8.0’పేరిట ఇటీవల 
విడుదల చేసిన గణంకాలు)  

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top