ఒక్కో పని కోసం ఒక్కో మండలం... ఇదే సింగరాయపల్లి దుస్థితి | singarayapalli villagers face problems three mandals | Sakshi
Sakshi News home page

ఒక్కో పని కోసం ఒక్కో మండలం... ఇదే సింగరాయపల్లి దుస్థితి

Mar 22 2026 1:16 PM | Updated on Mar 22 2026 1:16 PM

singarayapalli villagers face problems three mandals

  సింగరాయపల్లికి మూడు మండలాలతో లింకు 

 రెవెన్యూ పనుల కోసం పాల్వంచకు.. 

 పోలీస్‌ కేసుల విషయంలో రామారెడ్డి ఠాణాకు 

 సహకారం’ కోసం మాచారెడ్డి మండలానికి..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : పాలనా సౌలభ్యం ఏమో గానీ ఆ ఊరి ప్రజలు మూడు మండలాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి దాపురించింది. ఒక్కో పనికి ఒక్కో మండలానికి వెళ్లాల్సిందే. అవును.. మీరు చదువుతున్నది నిజమే ! ప్రస్తుతం పాల్వంచ మండలంలోకి మారిన ‘సింగరాయపల్లి’ గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్య ఇది. తాలూకా వ్యవస్థను తొ లగించి మండల వ్యవస్థను ఏర్పాటు చేసిన సమయంలో మాచారెడ్డి మండలం పరిధిలో సింగరాయ పల్లి గ్రామాన్ని చేర్చారు. అప్పటి నుంచి దాదాపు నాలుగు దశాబ్దాల పాటు మాచారెడ్డి మండలంలో కొనసాగింది. 

2016లో కొత్త జిల్లాలతోపాటు కొత్త మండలాలు ఏర్పాటు చేసే క్రమంలో సింగరాయపల్లి గ్రామాన్ని కొత్తగా ఏర్పాటైన రామారెడ్డి మండలంలోకి చేర్చారు. దీంతో గ్రామస్తులు తమ పనుల కోసం రామారెడ్డి మండలానికి వెళ్లి వచ్చేవారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాచారెడ్డి మండలంలోని పాల్వంచ కేంద్రంగా కొత్తగా మరో మండలం ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. ప్రజల విన్నపం మేరకు అప్పటి ప్రభుత్వం పాల్వంచ మండలాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సింగరాయపల్లిని పాల్వంచ మండలానికి మార్చారు. మాచారెడ్డి నుంచి రామారెడ్డికి, రామారెడ్డి నుంచి పాల్వంచ మండలానికి మారింది. గ్రామస్తులకు పాల్వంచ గ్రామం కొంత అనుకూలంగా ఉంటుందని భావించారు. అయితే మూడు మండలాలతో ఉన్న లింకు ఇబ్బందికరంగా మారింది.  

రామారెడ్డి పోలీస్‌ స్టేషన్‌ 
సింగరాయిపల్లి ఇప్పటికీ రామారెడ్డి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోనే ఉంది. దీంతో  కేసుల విషయంలో గ్రామస్తులు రామారెడ్డికి వెళ్లాల్సిందే. గ్రామంలో ఏ ఘటన జరిగినా రామారెడ్డి పోలీసులు రావాల్సిందే. కొత్త మండలంగా ఏర్పాటైన పాల్వంచకు పోలీస్‌ స్టేషన్‌ మంజూరు కాలేదు. దీంతో పోలీసు సేవలు రామారెడ్డి నుంచే అందుతున్నాయి.  

మాచారెడ్డి సొసైటీ  
‘సహకార’ సేవల కోసం సింగరాయపల్లి గ్రామస్తులు మాచారెడ్డికి వెళ్లాల్సిందే. పాల్వంచలో సొసైటీ ఏర్పాటు కాలేదు. సహకార బ్యాంకు శాఖ కూడా రాలేదు. దీంతో రుణాలు, పంటలకు అవసరమైన ఎరువుల కోసం మాచారెడ్డికి వెళ్లాల్సిందే. ఏ పని మీద వెళ్లినా రోజంతా అటే గడిచిపోయే పరిస్థితి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని రకాల సేవలు పాల్వంచ మండలంలో అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.  

పాల్వంచలో తహసీల్‌ సేవలు  
పాల్వంచ కేంద్రంగా కొత్త మండలం ఏర్పాటు చేస్తూ 2023 ఏప్రిల్‌ 18న జీవో విడుదలైంది. మే నెలలో తహసీల్‌ కార్యాలయం ఏర్పాటైంది. రామారెడ్డి మండలంలో కొనసాగిన సింగరాయపల్లి గ్రామాన్ని పాల్వంచ మండలానికి మార్చారు. తొలుత తహసీల్‌ కార్యాలయం ఒక్కటే ఏర్పాటైంది. గతేడాది జనవరి 28న మండల పరిషత్‌ కార్యాలయం ఏర్పాటుకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో సింగరాయపల్లి గ్రామస్తులు మండల పరిషత్‌ పనుల కోసం పా ల్వంచకు వెళ్తున్నారు. అయితే ప్రజాపాలనలో వివిధ పనులకు ఇప్పటికీ రామారెడ్డి మండల పరిషత్‌ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. పూర్తి స్థాయిలో మండల పరిషత్‌ సేవలను పా ల్వంచ మండలానికి ఇవ్వాలి. 

మూడు మండలాలు తిరగాల్సి వస్తోంది 
మా ఊరికి మూడు మండలాలతో లింకు ఉండడంతో చుట్టూ తిరగాల్సి వస్తోంది. అప్పట్లో అన్ని పనులకు రామారెడ్డికి వెళ్లేవాళ్లం. తరువాత పాల్వంచ మండలం అయ్యింది. దగ్గరైందన్న సంతోషం ఉన్నా, పనుల కోసం రామారెడ్డికి, మాచారెడ్డికి వెళ్లాల్సి వస్తోంది. – సొంటెం సాయిలు, గ్రామస్తుడు

రికార్డులను పాల్వంచకు మార్చాలి
పాల్వంచలో మండల పరిషత్‌ కార్యాలయం ఏర్పాటైనా ప్రజాపాలనకు సంబంధించిన పనుల కోసం రామారెడ్డి ఆఫీసుకు వెళ్లమంటున్నారు. మాకేమీ అర్థం కావడం లేదు. అన్ని రికార్డులను పాల్వంచకు మారిస్తే ఇబ్బంది పోతుంది.  
– కెంగర్ల భిక్షపతి, గ్రామస్తుడు

మా ఇబ్బందులు తీర్చాలి 
ఎరువుల బస్తాల కోసం మాచారెడ్డి సొసైటీకి వెళ్లాల్సి వస్తోంది. కో ఆపరేటివ్‌ బ్యాంకు కోసం కూడా మాచారెడ్డికి వెళ్లాలి. పోలీసు స్టేషన్‌కు రామారెడ్డికి, మండలాఫీసుకు పాల్వంచకు వెళ్లాలి. మా ఇబ్బందులను గుర్తించి వెంటనే అధికారులు సమస్యను పరిష్కరించాలి. 
అన్నబోయిన శ్రీనివాస్, గ్రామస్తుడు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement